AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అనేక రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. మూడు వారాల కిందట భారీ వర్షాలకు విజయవాడ ముంపు బారిన పడింది.దాదాపు సగం నగరం నీట మునిగిపోయింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టింది.దాతలు సైతం ముందుకొచ్చి స్వచ్ఛందంగా సాయం చేస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి.మరోవైపు ఇప్పుడిప్పుడే విజయవాడ కోలుకుంటోంది. సాధారణ పరిస్థితి వస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వాతావరణ శాఖ షాకింగ్ విషయాన్ని చెప్పింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఈనెల 24న అల్పపీడనం ఏర్పడుతుందని.. తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు కోస్తా ఆంధ్ర పై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్లు తేలింది.
* ఆ జిల్లాలపై ప్రభావం
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఆగ్నేయంగా కొనసాగుతున్న వాయుగుండం కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
* ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు
ఈ తుఫాను ప్రభావంతో ఏపీలో ఇతర ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా తుఫాను ప్రభావిత జిల్లాల్లో.. తీర ప్రాంతం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నచోట మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
* కీలక ప్రకటన
మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. తుఫాన్ దృష్ట్యా పంట పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మొత్తానికైతే వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలతో ఏపీలో మరోసారి ఆందోళన ప్రారంభమైంది.