Telangana PCC Chief : తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉంది. ఈ సమయంలో పీసీసీ చీఫ్‌గా పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా పనిచేశారు. పొన్నాల లక్ష్మయ్య సారథ్యంలో 2014 ఎన్నికలను, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో 2018 ఎన్నికలను ఎదుర్కొన్న కాంగ్రెస్ విజయం సాధించలేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా పదవి చేపట్టిన తర్వాత పార్టీకి జోష్ వచ్చింది. ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేంత్‌రెడ్డి పార్టీని అధికారంలోకి తెచ్చారు. అధికార పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్. రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పుడు కాంగ్రెస్‌లో అలజడి రేగింది. అలసైన కాంగ్రెస్ వాదుల పేరుతో సీనియర్లు వేరుకుంపటి పెట్టారు. ఇక కొందరు పార్టీని వీడారు. కానీ, రేవంత్ అందరినీ కలుపుకుని పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అందరూ ఆమోదించారు. కానీ, ఆయన అందరినీ కలుపుకుని కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న ఆదరణను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అయితే కొత్త సారథి ముందు అనేక సవాళ్లు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కష్టాలు తీరాక..
కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు కష్టాలన్నీ తీరాయి. దీంతో ఆయన తప్పుకున్నారు. ఆ స్థానంలో మహేశ్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించడంతో టీ కాంగ్రెస్‌లో కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పటి వరకు పలు సామాజికవర్గాల నేతలు టీపీసీసీ పదవి చేపట్టారు. గౌడ సామాజికవర్గానికి తొలిసారి పదవి దక్కింది.
పదవి అంత ఈజీ కాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా టీపీసీసీ చీఫ్ కావడం మామూలు విషయంకాదు. ఈ అవకాశం మహేశ్‌కుమార్‌గౌడ్‌కు దక్కింది. అయితే, అదే ఇప్పుడు ముళ్ల కిరీటం కూడా. పవేళ్లు అధికారం లేకపోవడంతో క్యాడర్ చాలా బలహీనపడింది. చాలా మంది పార్టీని వీడారు. అధికారంలోకి రావడంతో మళ్లీ రావడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే పదేళ్లు పార్టీ కోసం కష్టపడినవారిని, పార్టీని వీడి మళ్లీ చేరినవారిని సమన్వయం చేయడం ఇప్పుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ముందు ఉన్న సమస్య. పార్టీ పదవుల నియామకంలోనూ అందరినీ సంతృప్తి పర్చాల్సి ఉంటుంది. నామినేటెడ్ పదవుల్లోనూ కొత్త, పాతవారి మధ్య సయోధ్య కుదుర్చాలి. ఇది పీసీసీ కొత్త సారథికి కత్తిమీద సామే.
జీహెచ్‌ఎంసీలో పార్టీ బలోపేతం..
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేయడం మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అతిపెద్ద సవాల్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఇక 2009 తర్వాత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బాగా బలహీనపడింది. జీహెచ్‌ఎంసీకి జరిగిన రెండు ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం అధికార పార్టీగా వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. ఆమేరకు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత సారథిపై ఉంది. ఇక త్వరలో జరిగే పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ సత్తాను చాటాలి. మున్సిపాలిటీ, కార్పొరేషన్లనూ కైవసం చేసుకోవాలి. ఇది పీసీసీ చీఫ్‌కు అంత ఈజీ కాదు. వీటిని అధిగమించి.. పార్టీని బలోపేతం చేస్తేనే ఆయన పదవికి భద్రత ఉంటుంది.