AP Rain Alert: ఏపీకి చల్లని వార్త. బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు అవుతోంది. మరో మూడు రోజులు ఇలానే కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతానికి ఆనుకొని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనం గా మారి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
* ఈరోజు భారీ వర్షాలు పడే జిల్లాలు..
ప్రధానంగా ఈరోజు శ్రీకాకుళం( Srikakulam ), విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల,పలనాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైయస్సార్ కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల కింద, శిధిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద నిల్చో వద్దని విజ్ఞప్తి చేసింది. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు చెట్ల కింద తలదాచుకోవద్దని కూడా సూచించింది.
* మోస్తరు వర్షాలు నమోదు..
మరోవైపు శుక్రవారం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వాన పడింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. జూలైలో వర్షపాతం లోటు కనిపిస్తోంది. నాలుగో వారం సమీపిస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. మరోవైపు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించాయి. దీంతో ఇప్పుడు అల్పపీడనాలు, ఆవర్తనాలపై ఆధార పడాల్సి వస్తోంది.