PAC Chairman Election : ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కొత్త చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు.సభ్యులుగా శ్రీరామ్ రాజ్ గోపాల్, బీవీ జయరాగేశ్వరరెడ్డి, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బుర్ల రామాంజనేయులు, నక్క ఆనంద్ బాబు, కోళ్ల లలిత కుమారి, విష్ణు కుమార్ రాజు ఎన్నికయ్యారు.అయితే ఈ ఎన్నికలను వైసిపి బహిష్కరించింది. సాధారణంగా ప్రతిపక్షాలకు పిఎసి చైర్మన్ పదవి విడిచిపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా పీఏసీ కమిటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ కూడా కమిటీ సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగలేదు. అదే సమయంలో మొదటిసారిగా పీఏసీ చైర్మన్ పదవిని అధికారపక్షం దక్కించుకోవడం విశేషం. ఈసారి ప్రతిపక్షానికి ఆ పదవి ఇచ్చేందుకు అధికారపక్షం ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యంగా మారింది.
* చాలని సంఖ్యాబలం
ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. ఏదైనా ఒక పార్టీ నుంచి సభ్యుడు ఎన్నిక కావాలంటే ఆ పార్టీకి శాసనసభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉండాలి. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్య బలంతో వైసిపి మూడు కమిటీలకు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9 కి గాను మొత్తం పది చొప్పున నామినేషన్లు దాఖలు కావడంతో పోలింగ్ అనివార్యంగా మారింది.అయితే నామినేషన్లు వేసిన వైసిపి ఓటింగ్ కు దూరంగా ఉండిపోయింది. దీంతో కూటమి సభ్యులు అంతా గెలిచారు. అయితే వైసీపీలో ముగ్గురు పోటీ చేయగా శాసనసభ నుంచి పోటీ చేసిన పెద్దిరెడ్డి ఓడిపోయారు. ఎన్డీఏ నుంచి గెలిచిన వారిలో ఏడుగురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు, ఒకరు జనసేన, మరొకరు బిజెపి. ఎప్పటికీ స్పీకర్ తో పాటు డిప్యూటీ స్పీకర్ పదవులు తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దీంతో జనసేన విన్నపం మేరకు పీఏసీ చైర్మన్ పదవిని ఆ పార్టీకి కేటాయించారు.
* కీలకమైన పదవి
పీఏసీ చైర్మన్ పదవి అత్యంత కీలకమైనది. ఎక్కడైనా అవినీతి జరిగినా, అక్రమాలు చోటుచేసుకున్నా.. చైర్మన్గా వాటిని పరిశీలించే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశాన్ని వైసీపీ కోల్పోయింది. పారదర్శకంగా ఉండాలని లక్ష్యంతోనే ఈ పదవిని ప్రతిపక్షాలకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఇదే అమలవుతోంది. కానీ ఏపీలో తొలిసారి పిఎసి చైర్మన్ పదవిని అధికారపక్షమే దక్కించుకుంది. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉంది వైసిపి. జాతీయస్థాయిలో ఎండగట్టాలని సిద్ధపడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.