AP Petrol Prices : పెట్రోల్ ధరపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా షాకింగ్ విషయాలను బయటపెట్టింది. పెట్రోల్ ధరల్లో అన్ని రాష్ట్రాలకంటే ఏపీ ముందంజలో ఉందని స్పష్టం చేసింది. దీంతో జాతీయ స్థాయిలో ఏపీ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ అడిగి ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ పురి రాష్ట్రాల్లో అమలవుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్ , డీజిల్ ఉత్పత్తులకు ఒకే ధర అమలుచేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రాష్ట్రాల్లో వ్యాట్ ఆధారంగా ధరలు ఉన్నట్టు స్పష్టం చేశారు.
ప్రస్తుతం లీటర్ పెట్రల్ ధర రూ.111.78తో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. డీజిల్ ధరలో లక్షదీప్ ప్రథమస్థానంలో ఉండగా.,. ఏపీ ఆ తరువాత స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం లీటరు డీజిల్ ధర రూ.96.61లుగా ఉంది. జూలై 18వరకూ దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాలు, పట్టణాల్లో ఉన్న ధరలను కేంద్రం వెల్లడించింది. ఏపీకి సంబంధించి రిఫరెన్సీ అమరావతి నగరాన్ని తీసుకుంది. అయితే ఏపీలో పెట్రోల్ , డీజిల్ ధరలను చూసి మిగతా రాష్ట్రాలు నివ్వెరపోతున్నాయి. సంక్షేమంలో ముందున్న రాష్ట్రం.. ఇలా ప్రజలపై పన్నుల రూపంలో ముందుండడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల ముందు ఊరూవాడా చేతిలో పెట్రోల్; డీజిల్ సీసాలు పట్టుకొని ప్రచారం చేశారు. నాటి టీడీపీ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. పొరుగున ఉండే ఒడిశా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో డీజిల్ , పెట్రోల్ ధరలను ఉదహరిస్తూ బాదుడే బాదుడు అంటూ ఆరోపణలు చేశారు. దేవుడి దయతలచి మన ప్రభుత్వం వస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పన్ను తొలగించేస్తానని ప్రగల్బాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత రిక్తహస్తం చూపించారు. పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు, ఒడిశాతో పోల్చుకుంటే పెట్రోల్ ధర వ్యత్యాసం రూ.10 వరకూ ఉంది. అయితే ఆ రాష్ట్రాలు వ్యాట్ ఉపసంహరించుకున్నందు వల్లే తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ లభిస్తోంది. కానీ జగన్ సర్కారు మాత్రం కనీస ఉపశమన చర్యలు చేపట్టలేదు. నాడు విమర్శలు చేసిన వైనాన్ని సైతం మరిచిపోయి జగన్ ప్రవర్తిస్తున్నారు.