https://oktelugu.com/

Pulivendula: విజయమ్మను ఏడిపిస్తున్న ఏపీ రాజకీయాలు!

వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించారు జగన్. ఆ సమయంలో కుమారుడుని హత్తుకొని బోరున విలపించారు విజయమ్మ. కానీ ఆ రోదన వెనుక భర్త దూరమయ్యారన్న బాధ కంటే.. పిల్లలిద్దరి పరిస్థితిని తలుచుకొని ఆమె ఆవేదన చెందారు. రాజకీయంగా వైరి వర్గాలుగా మారి.. చేజేతులా ఇబ్బందులను తెచ్చుకున్నారని బాధపడ్డారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 11, 2024 / 03:16 PM IST

    AP Politics Making Vijayamma Cry

    Follow us on

    Pulivendula: వైఎస్ విజయమ్మ.. దివంగత రాజశేఖర్ రెడ్డి సతీమణి. రాజశేఖర్ రెడ్డి మరణం వరకు ఆమె రాజకీయాల వైపు చూడలేదు. చూసే అవసరం రాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పిల్లల కోసం తప్పకుండా ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. రాజకీయ అంశాలు మాట్లాడాల్సి వచ్చింది. తొలుత కొడుకు కోసం రోడ్డుపైకి వచ్చారు విజయమ్మ. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఆమె పిలుపును ప్రజలు ఆలకించారు. జగన్ ను ఆశీర్వదించారు. తరువాత కుమార్తె షర్మిల కోసం పరితపించారు విజయమ్మ. షర్మిల సోదరుడికి వ్యతిరేకంగా వెళ్ళగా.. ఆమెకు మద్దతుగా వెళ్లిన విజయమ్మ.. కుమారుడు జగన్ ను ఓడించాలని పరోక్షంగా పిలుపునిచ్చారు. ఇప్పుడు అదే విజయమ్మ ద్వారా తన రాజకీయ ఇబ్బందుల నుంచి అధిగమించాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. కానీ అందుకు కుమార్తె షర్మిల అభ్యంతరం చెబుతున్నారు. దీంతో పిల్లలిద్దరి మధ్య నలిగిపోతున్నారు విజయమ్మ. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉంది విజయమ్మ పరిస్థితి.

    వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించారు జగన్. ఆ సమయంలో కుమారుడుని హత్తుకొని బోరున విలపించారు విజయమ్మ. కానీ ఆ రోదన వెనుక భర్త దూరమయ్యారన్న బాధ కంటే.. పిల్లలిద్దరి పరిస్థితిని తలుచుకొని ఆమె ఆవేదన చెందారు. రాజకీయంగా వైరి వర్గాలుగా మారి.. చేజేతులా ఇబ్బందులను తెచ్చుకున్నారని బాధపడ్డారు. అయితే అంతకంటే ముందే జగన్ ఒత్తిడి పెంచారని.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని ప్రచారం జరుగుతోంది.

    ఈ ఎన్నికల్లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆ పార్టీ గెలిచింది కేవలం 11చోట్ల. రాష్ట్రవ్యాప్తంగా తుడుచుపెట్టుకుపోయింది ఆ పార్టీ. ఇంత ఘోర ఓటమిని జగన్ సైతం ఊహించలేదు. కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు.. ప్రత్యర్థులంతా ఏకం కావడం, కూటమి కట్టడం, ప్రభుత్వ వైఫల్యాలు వంటి కారణాలతో ప్రజలు తిరస్కరించారు. వీటన్నింటికీ తోడు సొంత సోదరి షర్మిల జగన్ ను వ్యతిరేకించారు. అదే తనను దారుణంగా దెబ్బతీసిందని జగన్ ఆగ్రహంగా ఉన్నారు. వైసిపి వైఫల్యాన్ని తాను క్యాష్ చేసుకోవాలన్న కోణంలో షర్మిల ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాలని భావిస్తున్నారు. వైసీపీలో ఉన్న కాంగ్రెస్ పూర్వ నాయకులను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం సైతం అదే పనిలో ఉంది. దీంతో జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

    గత ఐదేళ్లలో చంద్రబాబుకు ఎదురైన పరిణామాలు జగన్ కు తెలుసు. అందుకే అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ఇష్టపడడం లేదు. కడప ఎంపీగా పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అందుకే మొన్న ఇడుపులపాయకు వెళ్ళినప్పుడు తల్లిపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మను పోటీ చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై షర్మిల సైతం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కడప ప్రజలకు విజయమ్మ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. షర్మిలను ఆశీర్వదించాలని కోరారు. ఇంతలో ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వైయస్సార్ అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారించినట్లు సమాచారం. అందుకే పిల్లలిద్దరినీ సర్దుబాటు చేయలేక విజయమ్మ రాజశేఖర్ రెడ్డి సమాధి సాక్షిగా కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది. భర్త బతికున్నప్పుడు విజయమ్మకు రాజకీయాలు అవసరం రాలేదు. ఇప్పుడు అవే రాజకీయాలు ఆమెను ఏడిపిస్తున్నాయి. ప్రస్తుతం ఓదార్చే తోడు లేక.. పిల్లలిద్దరినీ సమన్వయం చేయలేక సతమతమవుతున్న విజయమ్మను చూసి.. సగటు వైయస్సార్ అభిమానులు బాధపడుతున్నారు. ఆమె గత వైభవాన్ని పోల్చుకొని వారు పడుతున్న బాధ వర్ణనాతీతం.