Pawan Kalyan
Pawan Kalyan : సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించడం ఒక సంచలనమే. అప్పటికే ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాలతో.. అదే కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి పార్టీని స్థాపించడం సాహసమే. ఇంతవరకు సరైన విజయం దక్కకుండా పార్టీని కొనసాగిస్తుండటం కూడా అభినందించదగ్గ విషయమే. కానీ ఇలా ఎన్నాళ్లు? ఎన్నేళ్లు? అన్నది పవన్ ఆలోచించుకోవాలి. సీరియస్ పాలిటిక్స్ ను అలవరుచుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. గతంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం నన్ను నమ్మండి, వ్యూహాలు నాకు వదిలిపెట్టండి, ఓటు మాత్రం జనసేనకు వెయ్యండి.. అన్న విన్నపం మాత్రం వినసొంపుగా ఉంది. కానీ దాని ఆచరణకు వచ్చేసరికి అనుకున్న స్థాయిలో ముందుకు జరగడం లేదు.
ఎన్నికల్లో ఇదే కీలక సమయం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఏపీకి మాత్రం నాలుగో విడత నిర్వహిస్తున్నారు. ఇంకా 50 రోజుల విలువైన సమయం ఉండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉంది. తాను చెప్పిన మాటలను నిజం చేసుకుంటే కచ్చితంగా జనసేనతో పాటు పవన్ కు, కూటమికి ఎన్నో రకాల ప్రయోజనాలు. కానీ ఇప్పటికీ పవన్ వాయిదాల తీరును కొనసాగిస్తున్నారు. కూటమిగా ఏర్పడిన మూడు పార్టీలు కలిసి చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించాయి. ఆ సభ తరువాత పవన్ ప్రజాక్షేత్రానికి దూరమయ్యారు.
వాస్తవానికి ఈనెల 27న వారాహి యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారు. పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆర్భాటం చేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో సైతం హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పార్టీ అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం నెలకొంది. తీరా 27వ తేదీ వచ్చేసరికి.. మరోసారి వాయిదా వేశారు. ఈనెల 31న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. అయితే ఇలాంటి వాయిదాలను సమర్ధించుకునే విధంగా కారణాలు చెప్పవచ్చు. కానీ పొలిటికల్ కెరీర్ నుంచే పవన్ పై ఈ వాయిదాల ప్రభావం అధికంగా ఉంది. విమర్శలకు దారితీస్తోంది. పవన్ కళ్యాణ్ కు విపరీతమైన చరిష్మ ఉంది. ఆయన నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళతాయి. విపరీతమైన ప్రభావం చూపుతాయి. కార్యక్రమాల నిర్వహణ విషయానికి వచ్చేసరికి, ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టే సమయంలో మాత్రం ఏవేవో కారణాలు తెరపైకి వస్తాయి. వాయిదాల పర్వం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఎన్నికల కీలక సమయంలో.. వాయిదాల సంస్కృతిని పక్కన పెడితే.. పవన్ అనుకున్నది తప్పకుండా సాధిస్తారు. లేకుంటే మాత్రం ఫెయిల్యూర్ ను మూటగట్టుకుంటారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap politics does pawan kalyan need to change
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com