AP New Pension Update: ఏపీలో( Andhra Pradesh) పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. జూన్ నెలకు సంబంధించి ఒక రోజు ముందుగానే పింఛన్ మొత్తాన్ని చేతికి అందనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీలో కీలకమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఇంటింటా వాలంటీర్లు పింఛన్లు అందించేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సిబ్బందికి ఆ బాధ్యతను అప్పగించారు. దాదాపు 11 నెలల పాటు ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేయగలిగింది ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీలు సమూల మార్పులు జరిగాయి. అప్పటివరకు ఇస్తున్న రెండు వేల పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచిన ఘనత కూటమిదే. మూడు నెలల బకాయి తో పాటు అందించింది కూడా.
* ఒకరోజు ముందుగానే..
సాధారణంగా పింఛన్ల పంపిణీ( pension distribution) అనేది ప్రతినెల ఒకటో తేదీన జరుగుతూ వస్తోంది. ఒకవేళ సెలవు రోజులు, పండుగల వస్తే ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఈసారి ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో.. ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయనున్నారు. జూన్ ఒకటిన ఆదివారం కావడంతో సెలవు దినం. అందుకే ఒకరోజు ముందుగా అంటే మే 31న పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మే 31న ఉదయం ఏడు గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు ఇస్తారు. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మే 31న డబ్బులు తీసుకో లేకపోతే జూన్ రెండున సచివాలయం వద్దకు వెళ్లి.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు పింఛన్ తీసుకోవచ్చు. మే 31న పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండడంతో సచివాలయ సిబ్బంది మే 31న బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది. పింఛన్ తీసుకునేవారు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Annadatha Sukhibhav : తొలి విడత ‘అన్నదాత సుఖీభవ’.. ఎట్టకేలకు క్లారిటీ!
* ఆ కేటగిరీ కింద పింఛన్లు
మరోవైపు రాష్ట్రంలో స్పౌజ్ ( spouse ) కేటగిరీ కింద 89,788 మందికి పింఛన్లు ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్య తదుపరి నెల నుంచి ఇస్తారు. ఈ కేటగిరీని గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు కూడా పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన మహిళలు భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్ కార్డు వివరాలను సచివాలయాల్లో ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఖజానాపై దాదాపు 36 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.
Also Read: Heavy rain in AP : బంగాళాఖాతం నుంచి బిగ్ అలెర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!
* కొత్త పింఛన్లకు ఎదురుచూపు..
అయితే కొత్త పింఛన్ల( new pensions ) కోసం లక్షలాది మంది లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు మంజూరు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే దీనిపై దర్యాప్తు చేసింది కూటమి ప్రభుత్వం. దాదాపు రెండు లక్షల వరకు బోగస్ పింఛన్లు ఉన్నట్లు తేల్చింది. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్లలో భారీగా బోగస్ ఉన్నట్లు సమాచారం. దీనిపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల జారీ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.