Gummanur Jayaram: ఎంపీ టికెట్ ఇచ్చినా వద్దంటున్న మంత్రి గుమ్మనూరు.. ఆయన స్టెప్ ఎటువైపు?

టిడిపిలో జడ్పిటిసి గా ఉన్న గుమ్మనూరు జయరాం కు జగన్ ఆలూరు నియోజకవర్గ టికెట్ ను కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలవడంతో మలివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు నీ పనితీరు బాగా లేదంటూ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు.

Written By: Dharma, Updated On : January 24, 2024 11:14 am

Gummanur Jayaram

Follow us on

Gummanur Jayaram: ఎవరైనా టిక్కెట్లు దక్కకుంటే పక్క పార్టీల వైపు చూస్తారు. తమకు సీట్లు ఇచ్చే పార్టీల్లో చేరతారు. కానీ ఏపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. వైసీపీలో టిక్కెట్ కన్ఫర్మ్ అయిన నేతలు సైతం పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ కోవలో మంత్రి గుమ్మనూరు జయరాం ఉండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న జయరాం కు కర్నూలు ఎంపీ టికెట్ ను సీఎం జగన్ కేటాయించారు. ఆయన స్థానంలో ఆలూరు నియోజకవర్గ టికెట్ ను జడ్పిటిసి విరూపాక్షకు కేటాయించారు. అయితే తాను ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని.. ఎమ్మెల్యే గానే పోటీ చేస్తానని జయరాం చెబుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

టిడిపిలో జడ్పిటిసి గా ఉన్న గుమ్మనూరు జయరాం కు జగన్ ఆలూరు నియోజకవర్గ టికెట్ ను కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలవడంతో మలివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు నీ పనితీరు బాగా లేదంటూ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో జయరాం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆలూరు కు కొత్త ఇన్చార్జిని ప్రకటించిన తర్వాత గుమ్మనూరు జయరాం నియోజకవర్గానికి వచ్చారు. కార్యకర్తలతో సమావేశం పెట్టి తనకు ఎమ్మెల్యే గానే పోటీ చేయాలని ఉందని కుండ బద్దలు కొట్టారు. ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొద్ది రోజులు పాటు బెంగళూరులోనే గడిపారు. ఆ తరువాత ఆలూరు వచ్చినా ఎవర్ని కలవలేదు. కొత్త ఇన్చార్జ్ విరూపాక్ష మంత్రిని కలిసేందుకు ప్రయత్నం చేసినాఆసక్తి చూపలేదు. చివరకు వైసీపీ ముఖ్య నేతలు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

జయరాం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. ఆయనకు కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. షర్మిల కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్న తరుణంలో.. ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయడమే మేలని గుమ్మనూరు జయరాం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రి నాగేంద్ర తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కర్ణాటక మంత్రినాగేంద్ర ఆయనకు సమీప బంధువు. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు ఆలూరు టికెట్ కేటాయించడం ఖాయంగా తేలుతోంది.

మరోసారి వైసీపీ నుంచి ఎంపీగా బరిలో దిగినా గెలుపు సాధ్యమయ్యే పని కాదని జయరాం భావిస్తున్నట్లు సమాచారం. అలాగని టిడిపిలోకి ఆహ్వానం లేదు. ఆలూరు నుంచి మరోసారి పోటీ చేస్తే గెలుపొందుతానని మాత్రం జయరాం నమ్మకం గా ఉన్నారు. జగన్ ను నమ్మితే ఇలా దెబ్బేశారని.. గత ఐదేళ్లుగా ఆలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని.. ఒక జడ్పిటిసి కి టికెట్ ఇవ్వడం ఏమిటని గుమ్మనూరు జయరాం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి ఆలూరు టికెట్ కేటాయించాలని జగన్ కు కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పరిస్థితిలో మార్పు రాకుంటే మాత్రం ఆయన పార్టీ మారడం ఖాయమని వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.