AP Mega DSC 2025: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని కూటమి భావిస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. శాసనసభ సమావేశాలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సభలో సమయం ఇవ్వరని.. అందుకే సభకు హాజరు కావడం వేస్ట్ అని జగన్ మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే సభకు హాజరుకాని వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఉంటుందని కూటమి నుంచి మాట వినిపిస్తోంది. ప్రధానంగా కొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండానే రిజిస్టర్లు సంతకాలు పెడుతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటువంటి వారిపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఇటువంటి తరుణంలో ఏపీ మంత్రి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నిస్తే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో జగన్మోహన్ రెడ్డి వేదిక పంచుకుంటారు. ఆ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లోకి వస్తే ఏపీ పొలిటికల్ చరిత్రలో ఒక లిఖించదగ్గ విషయమే.
* ఉమ్మడి ఏపీలో సహృద్భావం..
సాధారణంగా విరుద్ధ రాజకీయ పార్టీల నేతలు ఒకే వేదిక పైకి రావడం జరుగుతుంటుంది. 2014 కు ముందు ఉమ్మడి ఏపీలో ఒక మంచి వాతావరణం కొనసాగేది. సుదీర్ఘకాలం రాజకీయ ప్రత్యర్థులుగా ఉండే రాజశేఖరరెడ్డి( y s Rajasekhar Reddy ), చంద్రబాబు తరచూ ఒకే వేదికలపై కనిపించేవారు. ఎంతో ఆప్యాయతతో గడుపుతూ అందర్నీ ఆకట్టుకునేవారు. అప్పటివరకు శాసనసభలో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకునేవారు. కానీ ఒకే వేదికపై కలుసుకున్నప్పుడు మాత్రం ఆ ఛాయలు కనిపించేది కాదు. అంతలా కలిసిపోయేవారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత అది పూర్తిగా కనుమరుగయ్యింది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత.. రాజకీయ పార్టీల మధ్య సహృద్భావ వాతావరణం లేకుండా పోయింది.
* ప్రత్యేక ఆహ్వానం..
ఏపీ శాసనసభ సమావేశాలకు( AP assembly sessions) హాజరుకాని జగన్మోహన్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో ఈరోజు 16 వేల మందికి పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డిని సైతం ఆహ్వానించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. అయితే పులివెందుల ఎమ్మెల్యే హోదాలోనే ఆయనకు ఆహ్వానం పలికినట్లు చెప్పడం విశేషం. జగన్మోహన్ రెడ్డి తప్పకుండా హాజరవుతారని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వస్తే మాత్రం వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కానీ జగన్ వచ్చే అవకాశమే లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
* అధికారిక కార్యక్రమాలకు గైర్హాజరు..
2014లో తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. 2019 వరకు కొనసాగింది. అప్పట్లో ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందేవి జగన్మోహన్ రెడ్డికి. అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ఆ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా జగన్ రాలేదు. అయితే తాజాగా మెగా డీఎస్సీ నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి సైతం ఆహ్వానం అందింది. అయితే జగన్ రావాలి అనడం వెనుక కూడా కూటమి రాజకీయ వ్యూహం ఉంది. మెగా డీఎస్సీ ప్రకటించి పూర్తి చేయగలిగింది కూటమి ప్రభుత్వం. కచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి మైనస్. అందుకే ఆయనకు సభకు పిలిచినట్లు తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం లేదు అని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.