AP Mega DSC 2025 Postings: ఏపీలో( Andhra Pradesh) డీఎస్సీ నియామకాల కు సంబంధించి అంతిమ ఘట్టం ఈరోజు జరగనుంది. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు అమరావతి చేరుకున్నారు. వీరి కోసం అన్ని జిల్లాల నుంచి విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రిగా తొలి పై సంతకం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న 16,347 పోస్టుల భర్తీకి గాను మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు నెల రోజులకు పైగా ఆన్లైన్లో ఐదు లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. తొలుత ఫలితాలు ఇచ్చి.. మెరిట్ జాబితాను ప్రకటించారు. జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో ధ్రువపత్రాలను పరిశీలించారు. చివరిగా తుది జాబితాను ప్రకటించి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.
* సచివాలయం సమీపంలో.. అమరావతి( Amaravathi ) సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో నేడు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. వాస్తవానికి డీఎస్సీ అంటేనే అనేక రకమైన అడ్డంకులు ఉంటాయి. ముఖ్యంగా కోర్టు కేసులు వెంటాడుతాయి. కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాత్రం డీఎస్సీ 2025 ను సవాల్ గా తీసుకున్నారు. ఇబ్బందులు లేకుండా నియామక ప్రక్రియను పూర్తి చేయగలిగారు. అభ్యర్థులకు నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఒకసారి చరిత్రను పరిశీలిస్తే డీఎస్సీలో ఛాంపియన్ చంద్రబాబు అని స్పష్టమవుతుంది.
* ఇకనుంచి ఏటా డీఎస్సీ
అయితే ఇకనుంచి ఏటా డీఎస్సీ( DSc) ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 1994 నుంచి 2025 వరకు.. 14 డీఎస్సీలను ప్రకటించడం ద్వారా 1,96,619 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత మాత్రం తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే అడ్డుకునేందుకు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 106 కేసులు దాఖలు కావడం వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు కూటమి అనుమానిస్తోంది. అయితే ఇటువంటి అవరోధాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ ముందుగానే గుర్తించారు. అధికారులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ విజయవంతంగా నియామక ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ అయింది. 150 రోజుల వ్యవధిలోనే నియామక ప్రక్రియ పూర్తి చేసి రికార్డు సృష్టించారు. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 15,941 మంది ఎంపిక కాగా నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు.
* పక్కాగా ఏర్పాట్లు.. సచివాలయం( Secretariat) సమీపంలోని ప్రాంగణంలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం పండగ వాతావరణం లో నిర్వహించనున్నారు. ఎందుకు గాను పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల వారీగా రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన 16 మంది, ఆరుగురు ఇన్స్పైర్ విజేతలకు కలిసి 22 మందికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు. మిగిలినవారికి ప్రాంగణంలోనే అధికారులు నియామక పత్రాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో అభ్యర్థులు, వారితో పాటు వచ్చే కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం 34 వేల సిట్టింగ్ తో కుర్చీలు ఏర్పాటు చేశారు. రాయలసీమ, దక్షిణ కోస్తా, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వారీగా ప్రాంగణంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేశారు. జిల్లాతో పాటు నియోజకవర్గాల జోన్లను విభజించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి పాఠశాల విద్యాశాఖ తరఫున ఒక ఇన్చార్జిని నియమించారు. మొత్తానికి అయితే మెగా డీఎస్సీ 2025 విజయవంతంగా పూర్తి చేయడంలో మంత్రి నారా లోకేష్ సక్సెస్ అయ్యారు.