AP Media : ఢిల్లీ నేతలకు ఏపీ మీడియా మస్కా

అలాగని బీజేపీ చర్యలు వారికి మింగుడుపడవు. అందుకే తాము నిధులు ఇచ్చాం మహా ప్రభో అంటూ అగ్రనేతలు ఏపీ వచ్చి సౌండ్ చేసి మాట్లాడిన ఎల్లో, నీలి మీడియాలకు వినిపించలేదు.

Written By: Dharma, Updated On : June 17, 2023 9:01 am
Follow us on

AP Media : బీజేపీ విషయంలో ఏపీ మీడియా డిఫెన్స్ లో పడిందా? ఏపీకి కేంద్రం అందించే నిధుల విషయంలో మల్లగుల్లాలు పడుతోందా? కేంద్ర పెద్దల ప్రకటనను ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఇటీవల కేంద్ర పెద్దలు ఏపీకి వచ్చారు. శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, విశాఖలో హోం మంత్రి అమిత్ షాలు జగన్ సర్కారు తీరుపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు కలిసిన తరువాతే కేంద్ర పెద్దల వైఖరిలో మార్పు అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేయగా… బీజేపీ నేతల విమర్శలకు జగన్ తో పాటు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చినట్టు నీలిమీడియా రాసుకొచ్చింది.

వాస్తవానికి నడ్డా, అమిత్ షాలు కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులు, ప్రాజెక్టులు, పథకాల గురించి సమగ్రంగా వివరించారు. ఏ పథకానికి ఎంత ఇచ్చింది? కొన్ని ప్రాజెక్టుల్లో కేంద్రం వాటా, గృహనిర్మాణం వంటివి గణాంకాలతో సహా చెప్పారు. కానీ ఇవేవీ ఎల్లో, నీలిమీడియాల్లో కనిపించలేదు. అవేకానీ చెబితే బీజేపీ హైప్ అవుతుంది. ప్రజల్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది. కేంద్రం పట్ల సానుకూలత ఏర్పడుతుంది. అందుకే ఈ విషయంలో రెండు మీడియాలు కలిసిపోయాయి. కేంద్ర అందించిన సాయాన్ని దాచేసే ప్రయత్నం చేశాయి.

జగన్ సర్కారు అవినీతిపై బీజేపీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ వస్తోంది. ల్యాండ్, శ్యాండ్, వైన్, లిక్కర్ మాఫియా అంటూ ఎప్పటి నుంచో ఏపీ బీజేపీ నాయకులు ఆందోళనలు, నిరసనలు చేపడుతూ వస్తున్నారు. నాలుగేళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తునే ఉన్నారు. నడ్డా, అమిత్ షాలు ఇప్పుడవే ఆరోపణలు చేశారు. దీనిని రాజకీయ కోణంలో చూడాలే తప్ప… చంద్రబాబు వైఖరితో ఏకీభవించారని.. ఆయనతో సమావేశమైన తరువాత దూకుడు పెంచారని అనుకోవడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకటి మాత్రం వాస్తవం. ఏపీలో బీజేపీ ఎదగడం అటు చంద్రబాబు, ఇటు జగన్ లకు ఇష్టం లేదు. కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి స్నేహం వారికి అనివార్యం. కేంద్రం మద్దతు ఒకరికి లభిస్తే.. మరొకరికి ఇబ్బందులు తప్పవు. అందుకే రెండు పక్షాలు స్నేహంతోనే మెలుగుతున్నాయి. అలాగని బీజేపీ చర్యలు వారికి మింగుడుపడవు. అందుకే తాము నిధులు ఇచ్చాం మహా ప్రభో అంటూ అగ్రనేతలు ఏపీ వచ్చి సౌండ్ చేసి మాట్లాడిన ఎల్లో, నీలి మీడియాలకు వినిపించలేదు.