AP liquor scam : ఏపీ లిక్కర్ కుంభకోణంలో( AP liquor scam ) ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పట్టు బిగుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. అనంతరం విజయవాడ తరలించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు కూటమి ప్రభుత్వం అనుమానించింది. అయితే ఈ మొత్తం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని తేలింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుడుగా ఉండేవారు రాజ్ కసిరెడ్డి. వైసిపి పెద్దలు తమ చేతికి మట్టి అంటకుండా రాజ్ కసిరెడ్డి ద్వారా ఈ దందా నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేరుగా సూత్రధారి పట్టు పడడంతో కేసు ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. అయితే రాజ్ కసిరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పై పిటిషన్ వేయగా విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులకు పట్టుబడటం విశేషం.
Also Read : ఏపీ లిక్కర్ స్కాం.. సాయిరెడ్డి గుట్టు.. మిధున్ రెడ్డికి ఉచ్చు!
* మద్యం కుంభకోణం పై ఫోకస్
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మద్యం పాలసీ పై దృష్టి పెట్టింది. అప్పట్లో నాసిరకం మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని.. ఈ అనుమతుల వెనుక భారీగా కమీషన్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డిష్టలరీలతో రాజ్ కసిరెడ్డి ఒప్పందం చేసుకున్నారని.. వేలకోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని కూటమి అనుమానించింది. లోక్సభలో టిడిపి పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఇదే అంశాన్ని లేవనెత్తారు. నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు. అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఆది నుంచి లిక్కర్ కుంభకోణంలో ప్రముఖంగా వినిపించిన పేరు రాజ్ కసిరెడ్డి. అయితే మూడుసార్లు సిట్ నోటీసులు జారీచేసినా.. రాజ్ కసిరెడ్డి మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీంతో సిట్ దర్యాప్తు బృందం ఆయనను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.
* మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్
రాజ్ కసిరెడ్డితో( Raj Kashi Reddy ) పాటు ప్రముఖంగా వినిపించిన పేరు ఎంపీ మిధున్ రెడ్డి. డిష్టలరీలను భయపెట్టి స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలు మిథున్ రెడ్డి పై ఉన్నాయి. మరోవైపు రాజ్ కసిరెడ్డి హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నడిపినట్లు తెలుస్తోంది. ప్రతి సీసాపై కమీషన్ ముట్టనిదే అనుమతులు ఇచ్చేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం లిక్కర్ కుంభకోణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని చెప్పుకొచ్చారు. అవసరం అనుకుంటే తనను పిలవాలని.. కీలక ఆధారాలు ఇస్తానని చెప్పారు. ఈ తరుణంలోనే సీట్ సైతం విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన సైతం ప్రత్యేక దర్యాప్తు బృందానికి కీలక ఆధారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెద్దిరెడ్డి మిధున రెడ్డిని అరెస్టు చేయవద్దు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి అరెస్టు జరగడం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. రాజ్ కసిరెడ్డి గుట్టు విప్పితే అసలు వస్తుందని నేతలు భయపడుతున్నారు.
* మూడుసార్లు నోటీసులు
విచారణకు హాజరు కావాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team) రాజ్ కసిరెడ్డికి మూడుసార్లు నోటీసులు జారీచేసింది. ఆయన హాజరుకాకపోవడంతోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో కూడా రాజ్ కసిరెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజ్ కసిరెడ్డి పనిచేశారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఐటీ సలహాదారుడుగా నియమితులయ్యారు రాజ్ కసిరెడ్డి. ఈ సమయంలోనే లిక్కర్ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అయితే తప్పించుకుంటూ తిరుగుతూ వస్తున్న రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కానీ విచారణ వాయిదా పడింది. రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగిపోయింది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.
Also Read : ఏపీ లిక్కర్ స్కాంపై ఈ’ఢీ’.. అమిత్ షా చేతిలో ఆధారాలు!