AP Liquor scam : ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు అరెస్టులు కొనసాగుతుండగా
.. మరోవైపు నిందితులు, అనుమానితులు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఈ కేసులో బాలాజీ గోవిందప్ప అరెస్టు అయ్యారు. మద్యం కుంభకోణంలో ఏ 33 గా ఉన్న బాలాజీ గోవిందప్ప మైసూర్ లో ఉండగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్టు చేసింది. ఇప్పటికే ఆయనకు విచారణ కోసం నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పుడు ఏకంగా అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప కీలక వ్యక్తిగా అనుమానిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం.
Also Read : మద్యం కుంభకోణంలో అప్రూవర్ గా కీలక నిందితుడు?
* భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా..
భారతి సిమెంట్స్కు సుదీర్ఘకాలం డైరెక్టర్ గా వ్యవహరించారు బాలాజీ గోవిందప్ప( Balaji govindappa ). మద్యం కుంభకోణంలో ఈయన సైతం కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మద్యం కంపెనీలతోపాటు డిస్టలరీల నుంచి భారీగా నగదు వసూలు చేసి షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలాజీ గోవిందప్ప తో పాటు వైసిపి హయాంలో సీఎం ఓలో కీలక అధికారిగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తో బాలాజీ గోవిందప్ప భారీ అవినీతికి పాల్పడినట్లు సిట్ తన విచారణ అంశాల్లో పేర్కొంది. రాజ్ కసిరెడ్డి మద్యం కంపెనీల నుంచి వసూళ్లకు పాల్పడి.. బాలాజీ గోవిందప్ప కు అందించేవాడని.. ఆయన జగన్మోహన్ రెడ్డికి చేరవేసేవాడని ప్రత్యేక దర్యాప్తు బృందం తన విచారణ అంశాల్లో పేర్కొంది. ఇప్పుడు ఏకంగా బాలాజీ గోవిందప్ప అరెస్టు కావడం విశేషం.
* విచారణకు గైర్హాజరు.
ఈ నెల 11న మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరుకావాలని ధనుంజయ రెడ్డి( dhanunjay Reddy) , కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ ఆ నోటీసులను పెడచెవిన పెట్టారు. ఆ ముగ్గురు సైతం గైర్హాజరయ్యారు. మరోవైపు హైకోర్టు సైతం ఈ ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. సుప్రీంకోర్టు సైతం వీరి పిటిషన్ ను రద్దు చేసింది. ఈ తరుణంలో వీరి అరెస్టు జరుగుతుందని అంతా భావించారు. నాటకీయ పరిణామాల నడుమ మైసూర్లో బాలాజీ గోవిందప్ప అరెస్టు అయ్యారు.
* పెద్దిరెడ్డికి ఊరట..
మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి( peddi Reddy Mithun Reddy ) స్వల్ప ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడంతో ఆయన ముందస్తు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో హైకోర్టు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోలేదని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు హైకోర్టు తీరును తప్పు పట్టింది. ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని.. ఓ పార్లమెంటు సభ్యుడి గౌరవం విషయంలో ప్రత్యేక పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి ఉపశమనం కలిగించినట్లు అయింది.
Also Read : ఏపీలో ఆ ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు!