AP liquor scam : ఏపీ మద్యం కుంభకోణంలో( AP liquor scam) సంచలనం నమోదు కానుందా? రాజ్ కసిరెడ్డి అప్రూవర్ గా మారనున్నారా? ఈ మేరకు సంకేతాలు ఇచ్చారా? తనను బలి పశువు చేస్తున్నారని భావిస్తున్నారా? అందుకే అప్రూవర్ గా మారి మిగతా వారిని ఇరికించే ప్రయత్నాలు ప్రారంభించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కుంభకోణం పై ఫోకస్ పెట్టింది. సిఐడి ప్రాథమిక దర్యాప్తు చేసి వివరాలను సేకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగి అరెస్టులను ప్రారంభించింది. అయితే ఈ క్రమంలో ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం నిందితులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
Also Read : మళ్లీ జగన్ వస్తే..? టీడీపీ భయపడుతోందా?
* విజయసాయి ఆరోపణల వెనుక..
వాస్తవానికి విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy) రాజ్ కసిరెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చేశారు. ఆయనతోనే ఈ మొత్తం కుంభకోణం నడిచిందని చెప్పుకొచ్చారు. అయితే విజయసాయిరెడ్డి కామెంట్స్ ను రెండు విధాలుగా భావించవచ్చు. రాజ్ కసిరెడ్డిని ముందు పెట్టి.. జగన్మోహన్ రెడ్డిని తప్పించే కుట్రగా ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పై విజయసాయిరెడ్డి నేరుగా విమర్శలు చేయడం లేదు. మద్యం కుంభకోణంలో అడ్డగోలుగా దోచేసిన సొమ్ము ఎవరికి వెళ్లింది అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం రాజ్ కసిరెడ్డి పై ఉన్న వ్యక్తిగత కోపంతో అలా ఆరోపణలు చేసి ఉండాలి. లేకుంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు పరిణామాలు రాజ్ కసిరెడ్డికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నాయి. అందుకే ఆయన అప్రూవర్ గా మారేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
* స్పష్టమైన సంకేతాలు..
తాజాగా రాజ్ కసిరెడ్డి( Raj Kasi Reddy) తరపున ఓ లాయర్ వాదిస్తున్నారు. న్యాయస్థానంలో తన వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఆయన కోర్టు ముందే సంచలన ఆరోపణలు చేశారు. తన క్లైంట్ ను ఏ1 గా పెట్టి సూత్రధారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లాయర్ తన కామెంట్స్ తో రెండు వర్గాలకు సందేశం పంపారు. రాజ్ కసిరెడ్డిని మాత్రమే బలి చేయాలనుకుంటే.. మొత్తం బయటపెట్టేస్తానని జగన్ క్యాంపునకు సందేశం పంపారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో వాటాలు కుదరకపోవడం వల్లే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారన్నది ఒక అనుమానం.
* ఐటీ సలహాదారుడిగా..
మద్యం కుంభకోణంలో ఏ1 గా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుడుగా ఉండేవారు. ఏపీలో పదవి పొందినా హైదరాబాదు నుంచి కార్యకర్తలు సాగించేవారు. ఎన్నికల ఫలితాలు తర్వాత కూడా ఆయన హైదరాబాదులోనే ఉంటున్నారు. మద్యం కుంభకోణంలో పొందిన డబ్బుతో భారీగా వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అదే విజయసాయి రెడ్డికి కంటగింపుగా మారినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సూత్రధారి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డితో ఉన్న గొడవ కారణంగానే విజయసాయిరెడ్డి అలా చెప్పారని అంతా భావించారు. కానీ ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని బలిపశువు చేసి.. జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విజయసాయిరెడ్డి పై అనుమానాలు ఉన్నాయి.
* అసలు తత్వం బోధపడిందా?
అయితే జైలుకు వెళ్లిన రాజ్ కసిరెడ్డికి అసలు తత్వం బోధపడింది. తన చుట్టూ కుట్ర పన్నుతున్నారని అర్థమైంది. అందుకే ఆయన తన లాయర్ ద్వారా జగన్ శిబిరానికి స్పష్టమైన సంకేతాలు పంపారు. తనను బలి పశువు చేస్తే అవసరమైతే మొత్తం చెప్పేస్తానని ఆయన ఒక సంకేతం పంపారు. అప్రూవర్ గా మారిపోతానని కూడా హెచ్చరికలు పంపగలిగారు. మున్ముందు మద్యం కుంభకోణంలో పెద్ద పెద్ద అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో రాజ్ కసిరెడ్డి అప్రూవర్ గా మారితే నిజంగా సంచలనమే.