AP Liquor Policy: పారదర్శకంగానే లాటరీ.. కానీ రాజకీయ బెదిరింపులు.. చంద్రబాబు సీరియస్!

మద్యం ఇప్పుడు లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. గతంలో కొన్ని వర్గాల వారు మాత్రమే మద్యం వ్యాపారం చేసేవారు. కానీ లాభాలు కనిపిస్తుండడంతో ఇప్పుడు విపరీతమైన పోటీ నెలకొంది. ఈ క్రమంలో షాపులు దక్కించుకునేందుకు కొందరు రాజకీయ ఒత్తిళ్లకు సైతం దిగుతుండడం విశేషం.

Written By: Dharma, Updated On : October 15, 2024 1:36 pm

AP Liquor Policy

Follow us on

AP Liquor Policy:  ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు గాను ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ప్రారంభంలో వ్యాపారుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దరఖాస్తులు అంతంత మాత్రమే వచ్చాయి. రాజకీయ ప్రమేయంతోనే దరఖాస్తుల సంఖ్య తగ్గినట్లు గుర్తించిన ప్రభుత్వం.. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ జోక్యం వద్దని.. ఇందులో కలుగజేసుకోవద్దని మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చింది. అటు దరఖాస్తుల గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది. దీంతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 80 వేల వరకు దరఖాస్తులు అందాయి. నాన్ రెఫండబుల్ రుసుము రూపంలో 1800 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. నిన్ననే షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది. పారదర్శకంగా ఈ ప్రక్రియ విజయవంతంగా చేపట్టింది ప్రభుత్వం. ఈ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో లాటరీలో షాపులు దక్కించుకున్న వారిపై ఒక రకమైన ఒత్తిడి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పెట్టుబడి పెట్టకుండానే 20 శాతం వాటా ఇవ్వాలని కొందరు, గుడ్ విల్ ఇస్తాం షాపులు విడిచిపెట్టండి అని మరికొందరు, నెలనెలా మామ్మూళ్లు ఇవ్వాల్సిందేనని ఇంకొందరు అప్పుడే ఒత్తిడి ప్రారంభించినట్లు తెలుస్తోంది. మద్యం షాపుల విషయంలో జోక్యం వద్దని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా.. చాలామంది ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. సిండికేట్లు సైతం రంగప్రవేశం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

* వైసీపీ ప్రభుత్వం పై ఆ విమర్శ
వైసిపి హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. అయితే నాసిరకం బ్రాండ్లతో అధిక ధరలకు విక్రయించడంతో ప్రజల నుంచి ఒక రకమైన వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. అస్మదీయ కంపెనీల కోసం ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టడం పెద్ద విమర్శలకు దారితీసింది. ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి మద్యం పాలసీ కూడా ఒక కారణం. అందుకే చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే పాత ప్రీమియం బ్రాండ్లతో పాటు పాత ధరలకే మద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు.

* ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్న చంద్రబాబు
వైసిపి పై విమర్శలు వచ్చిన క్రమంలో చంద్రబాబు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పారదర్శకంగా లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయించాలని ఆదేశించారు. ఈ విషయంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. రాజకీయ ప్రమేయం లేకుండా చేశారు. అయితే పారదర్శకంగా షాపులు దక్కించుకున్న వ్యాపారులకు ఇప్పుడు రాజకీయ బెదిరింపులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓ 70 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో షాపుల విషయంలో ఒత్తిళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై సీఎం చంద్రబాబుకు నిఘా సంస్థలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వారందరిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.