AP journalism Updates: ఏపీలో( Andhra Pradesh) మీడియా పోకడలు మారాయి. రాజకీయ ద్వేషం పెంచడం, రాజకీయ ప్రత్యర్థులను వెంటాడడమే మీడియా పని అన్నట్టు పరిస్థితి మారింది. మొన్నటికి మొన్న సాక్షి మీడియాలో జరిగిన డిబేట్ జుగుప్సాకరంగా ఉంది. ఏదైనా ఒక చోట పేకాట ఆడితే.. ఆ ప్రాంతమంతా జూదరులే అన్నట్టు సాక్షి మీడియాలో డిబేట్ కొనసాగింది. అమరావతి ప్రాంతంలో ఏకంగా ఆ తరహా మహిళలు ఉన్నారంటూ ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. దానిని మరో సీనియర్ జర్నలిస్ట్ సమర్థించారు. దీంతో ఆ ఇద్దరు జర్నలిస్టులు కటకటాల పాలయ్యారు. అయితే కేవలం ఒక రాజకీయ పార్టీని, ఒక నాయకుడి పై వ్యతిరేకతతోనే తాను అలా మాట్లాడానని ఒక జర్నలిస్టు చెబుతుండడం మాత్రం నిజంగా బాధాకరం. ఆ రాజకీయ పార్టీని వ్యతిరేకించినందుకే.. ఆ నేత తీరుపై విరుచుకుపడుతున్నందునే ఆ మీడియా తనను ప్రత్యేకంగా ఆహ్వానిస్తోందని చెప్పడం కూడా గమనార్హం.
పెను ప్రకంపనలు.. అమరావతి( Amravati capital ) మహిళలపై సాక్షి మీడియాలో అనుచిత వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. ఈ నేపథ్యంలో అమరావతి రైతులతో పాటు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అరెస్టుల పర్వం ప్రారంభం అయింది. ముందుగా సాక్షి ఛానల్ డిబేట్ నిర్వాహకుడు, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనకు రెండు వారాలపాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఈ ఘటనకు ముఖ్య కారకుడుగా భావిస్తున్న జర్నలిస్టు కృష్ణంరాజు సైతం అరెస్టయ్యారు. ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. సాక్షి టీవీలో తనకు ఎనలేని గుర్తింపు లభిస్తోందని.. అందుకే ఆ మీడియాలో జరిగే చర్చల్లో పాల్గొంటున్నట్లు విచారణలో తెలిపారు కృష్ణంరాజు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీపై తనకు తీవ్ర వ్యతిరేక భావన ఉందని.. అది గుర్తించి కొమ్మినేని శ్రీనివాసరావు తనను ఆహ్వానించే వారని.. అలా ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పుకొచ్చారు కృష్ణంరాజు.
తగ్గిన మీడియా విలువలు..
గతంలో జర్నలిజం( journalism) అంటే ఒక ఫ్యాషన్ గా ఉండేది. ప్రజా సమస్యలు వెలికి తీసి.. ప్రజా గొంతుకగా మారి జర్నలిస్టులు తమదైన పాత్ర పోషించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఫలానా పార్టీకి, ఫలానా నేతకు వ్యతిరేకం.. అనుకూలం బట్టి ఆ జర్నలిస్ట్ స్థాయిని నిర్ధారించే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్. సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కానీ రాజకీయ నేతలతో అంటగాకి.. మీడియా ముసుగులో సేవలందించారు. అలానే గుర్తింపు సాధించారు. ఈ క్రమంలో ఆయన చాలామందికి వ్యతిరేకమయ్యారు. చాలామందిని వ్యతిరేకిస్తూ గుర్తింపు పొందారు. ఒకరు గుర్తింపు కోసం మరొకరిని వ్యతిరేకులుగా మార్చుకున్నారు. సాక్షి మీడియా అనేది జగన్మోహన్ రెడ్డి సొంత సంస్థ. ఆయన ప్రయోజనాల కోసం కచ్చితంగా అది కృషి చేస్తుంది. కానీ అక్కడ పని చేసేది చంద్రబాబు వ్యతిరేకి కొమ్మినేని శ్రీనివాసరావు. చంద్రబాబు పట్ల విపరీతమైన వ్యతిరేకత పెంచుకున్న జర్నలిస్టు కృష్ణంరాజు లాంటి వారిని పిలవడం కూడా ఇప్పుడు గుర్తించాల్సిన విషయం. అంటే టీవీ డిబేట్లకు వెళ్తున్న వారంతా.. ఆ సెక్షన్ మీడియా ఆశయాలు.. ఆ మీడియా పనిచేసే రాజకీయ పార్టీలకు అనుకూలంగా విశ్లేషించే వారన్నమాట. జర్నలిస్టు కృష్ణంరాజు కూడా ఇదే విషయాన్ని బయటపెట్టారు. తాను అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. కానీ తనను తాను మొండిఘటంగా చెప్పుకున్నారు. అందుకే సాక్షి డిబేట్లకు వెళ్లి.. చంద్రబాబు, టిడిపి కి వ్యతిరేక వ్యాఖ్యానాలు చేశానని.. అందులో భాగంగానే అమరావతి మహిళలపై ఆతరహా కామెంట్స్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు.