Whatsapp Governance: ఏపీ ప్రభుత్వం( AP government) మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాట్సాప్ ద్వారా 161 రకాల పౌర సేవలను అందించేందుకు సిద్ధపడింది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించారు. తొలివిడతలో మునిసిపల్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ శాఖలను అందించనున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ను కూడా విడుదల చేసింది. 9552300009 నెంబర్ను ఆశ్రయించవచ్చు. నీ సౌకర్యమే మా ప్రాధాన్యం అన్న స్లోగన్ తో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం.పౌర సేవలను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ఈ వినూత్న ప్రయత్నం చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించడం, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేయడం చేయనున్నారు. దేశంలో మరి ఏ రాష్ట్రంలో ఈ విధానం లేదు. తొలిసారిగా ఏపీలో ఈ విధానాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం.
* మెటాతో ఒప్పందం
వాట్సాప్ సేవలకు( WhatsApp services) గాను ఏపీ ప్రభుత్వం మెటాతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచే వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తేవాలని ప్రయత్నించింది. కానీ వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఈరోజు నుంచి సేవలు ప్రారంభించగలిగింది. తొలి విడతగా 161 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సులభంగా, వేగంగా పౌర సేవలు అందించాలన్నదే వాట్సాప్ గవర్నెన్స్ ముఖ్య లక్ష్యం.
* 161 రకాల సేవలు
వాట్సాప్ గవర్నెన్స్( WhatsApp governance) కోసం ఏపీ ప్రభుత్వం ఒక వాట్సాప్ నెంబర్ ను ప్రకటించింది. ఈ వాట్సాప్ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఈ నెంబర్ ద్వారా వాట్సాప్ ఖాతాను ఉపయోగించి పౌర సేవలు పొందే అవకాశం కల్పించనున్నారు. తొలి విడత లో 161 సేవలను అందిస్తారు. కీలకమైన శాఖల సేవలతో పాటు అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలకు సంబంధించి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. విద్యుత్ బిల్లులు, పన్నుల చెల్లింపుల వంటి సేవలతో పాటు దేవాలయాల్లో దర్శనాలు, వసతి గదుల బుకింగ్, విరాళాల సమర్పణకు సైతం ఇది ఉపయోగపడనుంది. పర్యాటక ప్రదేశాల సమాచారంతోపాటు టికెట్ బుకింగ్ వంటివి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులువుగా సేవలు పొందవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, ఆదాయ ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లు సైతం సులభంగా పొందవచ్చు.
* సంక్షేమ పథకాల సమాచారం
అయితే ఒక్క పౌర సేవలకి ( citizen services)కాదు.. ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా సమాచారం వేగంగా చేరవేయవచ్చు. ముందస్తు అప్రమత్త చర్యలు చేపట్టవచ్చు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ వాట్సాప్ నంబర్ ద్వారా అందనుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించేందుకు కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రభుత్వానికి ఏదైనా ఫిర్యాదు చేయాలని అనుకుంటే ఈ నెంబర్కు మెసేజ్ పంపితే సరిపోతుంది. మనం మెసేజ్ చేసిన అనంతరం అందులో సూచించిన విధంగా వివరాలు సబ్మిట్ చేస్తే మనకు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మన ఫిర్యాదు, వినతి ఎక్కడ ఉందనే సమాచారాన్ని సైతం ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.