Nagababu: మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Nagababu ) విషయంలో ప్లాన్ మారుతోందా? ఆయన పదవి విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారా? రూటు మార్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నెలలు గడుస్తున్నా.. దానికి సంబంధించి సన్నాహాలు జరగడం లేదు. ఎలా మంత్రి పదవి ఇస్తారో ఇంతవరకు బయటపడటం లేదు. కనీసం దానిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అయితే ఇప్పుడు నాగబాబు విషయంలో అనూహ్యంగా నిర్ణయం మార్చినట్లు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని మార్పు చేసుకున్నట్లు తెలుస్తోంది.
* కూటమి సమన్వయానికి కృషి
జనసేనతో ( janasena )పాటు కూటమి సమన్వయానికి నాగబాబు ఎంతో కృషి చేశారు. కూటమి తరుపున ప్రచారం కూడా చేశారు. వాస్తవానికి ఆయన అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశించారు. పొత్తులో తప్పకుండా దక్కుతుందని భావించారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే ఆ సీటు బిజెపికి కేటాయించడంతో నాగబాబు త్యాగం చేయాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఎక్కడ కూడా ఆయన పోటీ చేయలేదు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అప్పగిస్తారని అప్పట్లో టాక్ నడిచింది. అటు నామినేటెడ్ పోస్టుల జాబితాలను సైతం ప్రకటించారు. మొన్నటికి మొన్న మూడు రాజ్యసభ పదవులను సైతం భర్తీ చేశారు. ఆ సమయంలో సైతం చివరి వరకు నాగబాబు పేరు వినిపించింది. ఆయనకు చాన్స్ దక్కకపోవడంతో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇది జరిగి నెలలు దాటుతున్న ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
* సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ
ప్రస్తుతం విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) రాజీనామాతో రాజ్యసభకు ఖాళీ అయింది. ఈ పదవికి సంబంధించి ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలో ఆ పదవికి నాగబాబుకు ఎంపిక చేస్తారని టాక్ ప్రారంభం అయింది. దానికి కారణాలు లేకపోలేదు. నాగబాబును ఏపీ క్యాబినెట్ లోకి తీసుకోవడం పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుకు సులువే. కానీ నాగబాబును తీసుకోవడంతో క్యాబినెట్లో అన్నదమ్ములకు చోటు ఇచ్చినట్టు అవుతుంది. అయితే అది జనసేనకు మైనస్ చేస్తుందన్నది పవన్ ఆలోచన. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించగానే చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. అయితే ఇవేవీ పట్టించుకోకుండా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఒక నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ పదవి ఖాళీ అయింది. అందుకే ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ మనసు మార్చుకున్నట్లు సమాచారం.
* మూడున్నర ఏళ్ల పాటు ఎంపీగా
మరో మూడున్నర ఏళ్ల పాటు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) పదవి ఉంది. అంటే ఆ పదవిని తీసుకుంటే నాగబాబు మూడున్నర ఏళ్ల పాటు ఎంపీగా కొనసాగవచ్చు. ఇప్పటికే ఈ పదవి కోసం కూటమిలో చాలామంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. చివరకు చంద్రబాబుతో పాటు పవన్ నాగబాబుకు అవకాశం ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా జనసేన తరఫున జాతీయ రాజకీయాల్లో నాగబాబుకు బాధ్యతలు అప్పగించవచ్చని పవన్ ఆలోచన చేస్తున్నారట. మొత్తానికైతే నాగబాబు రాష్ట్ర మంత్రి అవుతారని అంతా భావించారు. కానీ ఆయన ఎంపీగా మరి పెద్దల సభలో అడుగు పెట్టాలని ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అటు రాజకీయ పరిస్థితుల సైతం అలానే ఉండడంతో.. దానికి జై కొట్టారు చంద్రబాబు, పవన్. మరి ఏం జరుగుతుందో చూడాలి.