AP Heat Wave: ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వర్షాలు కొనసాగుతున్నాయి. మరో రెండు రోజులపాటు ఇదే రకమైన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉండగా.. ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అయితే వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండగా.. మిగతా ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు సెగలు పుట్టిస్తున్నాయి.
Also Read: సింధు జల ఒప్పందం తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?.. ఆ ప్రాంతం ఎడారిగా మారనుందా?
* ఉత్తర కోస్తా లో వర్షాలు..
ప్రధానంగా ఉత్తర కోస్తాలో( North coastal) ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ శాఖ తాజా ఆదేశాలు జారీచేసింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి జిల్లాలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. మరోవైపు ఆదివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో 42.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావికమతం, కడప జిల్లా వేంపల్లి లో 41.4, విజయనగరం జిల్లా గుర్లలో 41.2, తూర్పుగోదావరి జిల్లా మురమండ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 55 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం.
* ఎండ తీవ్రత పెరిగే అవకాశం..
ఈరోజు నుంచి వాతావరణం లో స్పష్టమైన మార్పులు కనిపించనున్నాయి. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి తరువాత నుంచి ఎండల తీవ్రత పెరిగింది. అదే సమయంలో వర్షాలు కూడా పడ్డాయి. కానీ మే ప్రవేశిస్తుండడంతో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు వీచిన గాలులు కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే వడగల్పుల తీవ్రత పెరిగి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యే సూచనలు ఉన్నాయి.
Also Read: ముగిసిన పాకిస్థానీ గడువు.. దేశం వీడకుంటే జైలుకే..