https://oktelugu.com/

AP Secretariat Employees: సచివాలయ ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

వైసిపి హయాంలో ఏర్పాటు అయింది సచివాలయ వ్యవస్థ. పాలనను మరింత సులభతరం చేసేందుకు గ్రామాల్లో సచివాలయాలను ఏర్పాటు చేశారు. అక్కడ కార్యదర్శులను నియమించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 1, 2024 / 10:15 AM IST

    AP Secretariat Employees

    Follow us on

    AP Secretariat Employees: గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.అటెండెన్స్ విషయంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. విధిగా హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో హాజరు నమోదు చేయాలని సూచించింది.గతంలో రోజుకు ఒకసారి మాత్రమే హాజరు వేస్తే సరిపోయేది. కానీ ఇకనుంచి అలా చేస్తే కుదరదని తేల్చి చెప్పింది. 2019 అక్టోబర్ 2న జగన్ సర్కార్ సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయాల్లో 11 శాఖలకు సంబంధించి కార్యదర్శులను నియమించింది.ఇందులో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది కూడా ఉన్నారు. ఆరోగ్యశాఖ కార్యదర్శిలతో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శిలు ఫీల్డ్ స్టాఫ్ గా ఉంటారు. ఇంకోవైపు విద్యుత్ శాఖలో పని చేస్తున్న సహాయకులు కూడా ఉంటారు. అయితే వీరి హాజరు విషయంలో కొన్ని మినహాయింపులు ఉండేవి. అయితే మధ్యలో బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది అప్పటి సర్కార్. దీనిని సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గింది. అయితే ఎన్నికల్లో చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా చూసుకుంటామన్నది ఆ హామీ. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు కూడా కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత చూపారు. అయితే ఇప్పుడు హాజరు విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు.

    * రోజూ బయోమెట్రిక్ హాజరు
    గత సెప్టెంబర్ లో హాజరు విషయంలో కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు హోదాతో సంబంధం లేకుండా రోజుకు మూడుసార్లు బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని స్పష్టం చేసింది. రోజుకు మూడుసార్లు ముఖ హాజరు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారు హాజరు వేస్తున్నారా లేదా అని ఆరా తీసే బాధ్యతను ఎంపీడీవోలతో పాటు మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. ఉదయం 10:30 గంటలకు మొదటిసారి, మధ్యాహ్నం మూడు గంటలకు రెండోసారి, సాయంత్రం ఐదు గంటలకు మూడోసారి బయోమెట్రిక్ హాజరు వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించింది. కానీ అమలు చేయలేక పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం పక్కాగా అమలు చేస్తూ వస్తోంది.

    * తాజాగా మరో నిబంధన
    తాజాగా ఈ హాజరు విషయంలో మరో నిబంధనను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. ఉదయం సాయంత్రం వేళల్లో మొబైల్ యాప్ లో అటెండెన్స్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హాజరుకు సంబంధించి సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక యాప్ రూపొందించింది. విధులకు హాజరైనప్పుడు, వీధుల ముగింపు సమయంలో కచ్చితంగా ఆ యాప్ లో నమోదు చేయాలి. లేకుంటే విధులకు గైర్హాజరైనట్లే. అయితే ఇప్పటికే బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నామని.. ఇప్పుడు మొబైల్ యాప్ లో కూడా హాజరు నమోదు చేయడం ఏమిటని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జీతం మూరెడు.. పని బారేడు అన్నట్టు ఉంది తమ పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.