Ramoji Rao: దివంగత రామోజీరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన విషయంలో అభ్యంతరాలు ఉన్నా.. ఒక తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఆయన ఎదిగిన తీరు మాత్రం అభినందనీయం.ఆదర్శం కూడా. అందుకే ఏపీ ప్రభుత్వం రామోజీరావుకు ఘన నివాళులు అర్పించేందుకు సన్నద్ధమైంది. ఈనెల 27న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సంస్మరణ సభను ఏర్పాటు చేసింది. రామోజీరావు పుట్టి పెరిగిన కృష్ణాజిల్లాలోని ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలను విడుదల చేసింది. మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్రల సమన్వయంలో కార్యక్రమ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
Also Read: YS Jagan: అధికారంలో ఉంటే ఆకాశంలో.. ఇప్పుడు రోడ్డు మార్గంలో.. జగన్ పరిస్థితి ఇది
రామోజీరావు సంస్మరణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ హాజరుకానున్నారు. పలువురు ప్రముఖులు సైతం హాజరవుతారు. ఈ నేపథ్యంలో అక్కడ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వివిఐపీలతో పాటు సాధారణ ప్రజానీకానికి ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రత్యేక గ్యాలరీలకు ఇన్చార్జిలనుసైతం నియమించారు. మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుండడం విశేషం. రామోజీరావు జ్ఞాపకాలు తెలుగువారితోను, తెలుగు నేలతోనూ చిరస్థాయిగా గుర్తుండి పోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Also Read: Pawan Kalyan : పవన్ వద్దకు క్యూ కడుతున్న సినీ పెద్దలు
మీడియా రంగంలో సరికొత్త విప్లవాలు సృష్టించారు రామోజీరావు. మీడియా మొఘల్ గా అవతరించారు. అందుకే ఆయన స్ఫూర్తికి తగ్గట్టు గౌరవించాలని నిర్ణయించారు. ఏపీ ప్రెస్ అకాడమీ పేరును ‘ రామోజీ ప్రెస్ అకాడమీ’గా మార్చి ఆలోచన చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి రాజధాని పేరు సూచించిన వ్యక్తి రామోజీరావు అని ఇటీవల చంద్రబాబు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రామోజీ విగ్రహానికి స్థలాన్ని కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రకటన చేశారు. అమరావతిలో రామోజీ స్మారకం నిర్మిస్తామని చెప్పారు. ఈ రెండు ప్రకటనలు సంస్మరణ సభలో చంద్రబాబు వెల్లడించే అవకాశం ఉంది.