https://oktelugu.com/

America: అమెరికాలో కొలువుల సంక్షోభం!

America: నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నవారిని కూడా కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలా మంది హోటళ్లు, గ్యాస్‌ స్టేషన్లలో పనిచేస్తున్నారు. రుణాలు తీర్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 24, 2024 / 01:57 PM IST

    Unemployment crisis in America

    Follow us on

    America: అగ్రరాజ్యం అమెరికాలో గత రెండున్నర దశాబ్దాల్లో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం నెలకొంది. ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్తున్న వేలా దిమంది డిగ్రీలు పట్టుకుని కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణం భయపెడుతుండగా, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నవారిని కూడా కంపెనీలు తొలగిస్తున్నాయి. బాధితుల్లో చాలా మంది హోటళ్లు, గ్యాస్‌ స్టేషన్లలో పనిచేస్తున్నారు. రుణాలు తీర్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

    చదువు.. కొలువు కోసం..
    అమెరికాలో ఉన్నత చదువు చదవడంపాటు అక్కడే సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో అధిక వేతనంతో ఉద్యోగాలు పొందడానికి భారత్‌ నుంచి అనేక మంది విద్యార్థులు అగ్రరాజ్యం వెళ్తున్నారు. 2022–23లో దాదాపు 2 లక్షల మంది వెళ్లారు. వీరిలో తెలుగు విద్యార్థులు 45 వేల నుంచి 55 వేల మంది ఉన్నారు. అమెరికా వెళ్తున్న వారిలో చాలా మంది ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్, దాని అనుబంధ కోర్సులు చదువుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు అమెరికాలో ఎంఎస్‌ చేసిన వారిలో 85 శాతం మంది అక్కడే కొలువు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

    ఎందుకీ పరిస్థితి..
    కోవిడ్‌ ప్రభావం 2020లో ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. ఏడాదిన్నర వరకు ఈ పరిస్థితి కొనసాగింది. రెండుసార్లు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అమెరికాలో ఉన్న పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిని రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో 2021–22 లో కంపెనీలకు భారీగా నిధులు అందాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో కంపెనీలు పుంజుకున్నాయి. దీంతో ఐటీ కంపెనీలకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. కంపెనీలు సైతం ఉద్యోగులను అదే స్థాయిలో నియమించుకున్నాయి. కోవిడ్‌ తగ్గిపోయాక అమెరికా ప్రభుత్వం ప్యాకేజీలను నిలిపివేసింది. పారిశ్రామికరంగం పుంజుకోలేదు. మరోవైపు బ్యాంకులు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాలేదు. దీంతో రుణాలు ఇవ్వడం నిలిచిపోయింది. అప్పటికే 3 నుంచి 4 శాతం ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి పెంచాయి. దీని ప్రభావం మళ్లీ పారిశ్రామికరంగంపై పడింది. దీంతో ఐటీ కంపెనీలకు ఆర్డర్లు తగ్గిపోయాయి. దీంతో కంపెనీలు ఉద్యోగులను తగ్గించడం మొదలు పెట్టాయి. 2023 నుంచి అధిక వేతనాలు ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వేతనాలు తగ్గించాయి. గతంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన ఐటీ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలో నియామకాలు చేస్తున్నాయి.

    భారతీయులపై ప్రభావం..
    సంక్షోభ ప్రభావం ఎక్కువగా భారత్, చైనాపై పడుతోంది. అమెరికా వెళ్తున్నవారిలో ఈ రెండు దేశాల వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో అమెరికాలో ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఎంఎస్‌ పూర్తి చేసిన వెంటనే యూనివర్సిటీ విద్యార్థి పేరిట ఓపీటీ ఐ20 విడుదల చేస్తుంది. ఇది వచ్చిన నెల రోజుల్లో ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌కు దరఖాస్తు చేయాలి. దీనికి ఆమోదం లభించిన మూడో నెలల్లో ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి. లేనిపక్షంలో దేశం విడిచి వెళ్లిపోవాలి. అయితే విద్యార్థులు వర్సిటీ ఫీజుల కోసం రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉండలేక, స్వదేశానికి రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించి అమెరికాలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఎంఎస్‌లో ఫెయిల్‌ అవుతుండగా, కొందరు ప్రొఫెసర్ల వద్ద సహాయకులుగా చేరుతున్నారు. ప్రొఫెసర్‌ ఇచ్చే పత్రంతో ఏడాది అక్కడ ఉండొచ్చు.

    ప్రభుత్వం తోడ్పాటు అందిస్తేనే..
    ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం నుంచి మళ్లీ తోడ్పాటు కోరుకుంటున్నారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం కంపెనీలకు ప్రోత్సాహకాలు అందుతాయని భావిస్తున్నారు. గతంలో ట్రంప్‌ తోడ్పాటు అందించారని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో ట్రంప్‌ గెలిస్తే మళ్లీ ప్రోత్సాహకాలు ఇస్తారని భావిస్తున్నారు.