Pawan Kalyan : తెలుగు చిత్ర పరిశ్రమ ఖుషి గా ఉంది. ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామి కావడంతో ఆనందం వ్యక్తం చేస్తోంది. ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణకు ఇదో సదా అవకాశంగా భావిస్తోంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. చివరకు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు అప్పటి సీఎం జగన్ కు ప్రాధేయపడినంత పని చేశారు. అయినా సరే చాలా విషయాల్లో వైసీపీ సర్కార్ సినీ పరిశ్రమకు న్యాయం చేయలేదు. ఈ తరుణంలోకూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం,పవన్ డిప్యూటీ సీఎం కావడం, జనసేనకు చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కావడంతో చిత్ర పరిశ్రమలో ఆశలు చిగురించాయి. సోమవారం డిప్యూటీ సీఎం పవన్ ను తెలుగు సినీ నిర్మాతలు కలవనున్నారు. సమస్యలు వివరించనున్నారు.
ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి విస్తరణ దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేయనుంది. విశాఖ తో పాటు విజయవాడ, తిరుపతిలో సినిమా షూటింగ్లకు సంబంధించి మరిన్ని వసతులు కల్పించేందుకు నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. వాటికి పరిష్కార మార్గం చూపించాలని నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులబాటు, థియేటర్ సమస్యలు వంటి విషయాలు పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు చర్చించనున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షో వంటి విషయాల్లో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు సినీ ఇండస్ట్రీ దారుణంగా నష్టపోయింది. దీంతో సినిమా ఇండస్ట్రీ జగన్ కు వ్యతిరేకంగా పనిచేసింది. చాలామంది నటులు, నిర్మాతలు టిడిపి కూటమికి బహిరంగంగానే తమ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు కూటమి విజయం సాధించడంతోపాటు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో ఇండస్ట్రీ కష్టాలు కొంతమేర తీరుతాయని అభిప్రాయపడుతున్నారు.
ఈరోజు పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇప్పటికే పవన్ గెలుపుపై సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు సైతం తెలిపారు. ఈరోజు ప్రత్యేకంగా సినీ నిర్మాతలు పవన్ ను కలవనున్నారు. అశ్విని దత్, హారిక హాసిని చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య తదితరులు కలవనున్నారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కందుల దుర్గేష్ ను సైతం మర్యాదపూర్వకంగా కలవనున్నారు.