Amrapali Kata: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌లు.. పదేళ్లుగా క్యాట్ అనుమతితో తెలంగాణలో కొనసాగుతున్నారు. ఇటీవల వీరు సొంత రాష్ట్రానికి వెళ్లాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా క్యాడర్ ఐఏఎస్‌లను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిర్ణయంపై వారు క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ కూడీ డీవోపీటీ నిర్ణయాన్ని సమర్థించింది. తర్వాత హైకోర్టుకు వెళ్లారు.. అక్కడా నిరాశే ఎదురైంది. చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తలుపు కూడా తట్టారు. అక్కడా ఊరట లభించలేదు. దీంతో అక్టోబర్ 16న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా క్యాడర్‌కు కేటాయించిన ముగ్గురు ఐఏఎస్‌లు అమ్రాపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, వాణీ ప్రసాద్‌ను రిలీవ్ చేసింది. దీంతో వారు అదే రోజు ఏపీలో రిపోర్టు కూడా చేశారు.
పది రోజుల తర్వాత పోస్టింగ్..
హడావుడిగా ఏపీలో జాయిన్ అయిన ఐఏఎస్‌లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కుదురుకునే అవకాశం కల్పించింది. పది రోజుల తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈమేరకు సీఎస్ నీరభ్‌కుమార్ ఆదివారం రాత్రి(అక్టోబర్ 27న) ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా అమ్రాపాలికి కీలక బాధ్యతలు అపపగించారు. ఆమెకు ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. మరో ఐఏఎస్ వాకాటి కరుణను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమించారు. దీంతోపాటు హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ వాణీ మోహన్‌ను బదిలీ చేశారు. వాణీ మోహన్‌కు జీఏడీలో సర్వీసుల వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆ బాధ్యతలు చూస్తున్న భాస్కర్‌ను సీఎస్ రిలీవ్ చేశారు. కార్మిక శాఖ కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచి ఎం.ఎం.నాయక్‌ను ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఇక మరో ఐఏఎస్ రొనాల్డ్ రాస్‌కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.
పునర్విభజన చట్టం ప్రకారం..
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. కేటాయించిన రాష్ట్రాల్లోనే విధులు నిర్వహించాలని డీవోపీటీ తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ అధికారులను ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నలుగురిని రిలీవ్ చేసింది. ఇక ఏపీ నుంచి రిలీవ్ అయిన తెలంగాణ క్యాడర్ ఐఏఎస్‌లు సృజన, హరికిరణ్, శివశంకర్ ఇటీవలే తెలంగాణలో రిపోర్టు చేశారు. వీరికి రేవంత్ సర్కార్ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.