AP Government Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయుల( government teachers ) విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయనుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం టెట్ అర్హత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వీలైనంత త్వరగా టెట్ నిర్వహించి.. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వైపు అడుగులు వేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే 2010కి ముందు ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయులు కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష రాయాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2010కి ముందు ఎంపికైన చాలామంది ఉపాధ్యాయులు పదవీ విరమణ వయసులో ఉన్నారు. తాజాగా పరీక్ష నిర్వహించడం పై వారంతా ఆందోళనతో ఉన్నారు. వారి విన్నపం మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధం కావడం మాత్రం విశేషమని చెప్పాలి.
Also Read: పటిష్టంగా ఆస్ట్రేలియా.. సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా చేయాల్సింది ఇదే!
* టెట్ కు షెడ్యూల్..
ఇటీవల ప్రభుత్వం టెట్( teacher eligibility test) నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో 2010కి ముందు డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పు పై రివ్యూ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తామని చెప్పిన లోకేష్.. ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ వేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ పరీక్ష నిర్వహణలో మినహాయింపు దక్కే అవకాశం ఉంది.
* సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
సుప్రీం కోర్టు ( Supreme Court) ఈ ఏడాది సెప్టెంబర్ 1న సంచలన తీర్పు ఇచ్చింది. ఓ రాష్ట్రానికి సంబంధించి ఉపాధ్యాయ నియామకం విషయంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పాస్ కావాల్సిందేనని తేల్చి చెప్పింది. టెట్ లేకుండా ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్నవారు ఇప్పుడు అర్హత సాధించాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా ఇప్పుడు టెట్ రాయాల్సి వస్తోంది. దీంతో వారంతా ఆందోళనతో ఉన్నారు. ఇటువంటి సమయంలో మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వం తరుపున రివ్యూ పిటిషన్ వేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ఉపశమనం పొందుతున్నారు. గురువారమే ఏపీ ప్రభుత్వం టెట్ నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 10న పరీక్ష నిర్వహించనుంది. జనవరి 19న ఫలితాలు విడుదల చేస్తామని చెబుతోంది. ఒకవైపు పరీక్ష నిర్వహణకు సిద్ధపడుతూనే.. మరోవైపు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయనుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.