India Vs Australia 1st T20: టి20 లలో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఇంతవరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. శ్రీలంక నుంచి మొదలు పెడితే సౌత్ ఆఫ్రికా వరకు ప్రతి జట్టుమీద విజయం సాధించి.. సిరీస్ అందుకుంది. టీమిండియా గడిచిన 29 మ్యాచ్లలో 25 విజయాలు సొంతం చేసుకుంది. దీనిని బట్టి టీమిండియా ఆట తీరు అర్థం చేసుకోవచ్చు.
Also Read: సూర్య భాయ్.. నీ ప్రతాపం చూడక.. ఎన్ని రోజులైందో తెలుసా?
ఇటీవల వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా పై ఒత్తిడి ఉంది. చివరి మ్యాచ్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా పై టీమ్ ఇండియా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో.. టీ 20 సిరీస్ లో అదరగొడుతుందని అందరూ భావిస్తున్నారు. పైగా టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు మీద టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో అదే ఒరవడి ఆస్ట్రేలియా జట్టు మీద కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు బలంగా ఉండడం పైగా సొంత గడ్డపై ఆడుతున్న నేపథ్యంలో టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలి వన్డే సిరీస్ లో కూడా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీగా పోటీ జరిగింది.
ఇటీవలి ఆసియా కప్ లో టీమిండి అద్భుతమైన ప్రదర్శన చేసింది.. అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా గడ్డమీద అతను ఎటువంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. విధ్వంసకరమైన బ్యాటింగ్ తో అభిషేక్ శర్మ దడ పుట్టిస్తాడు. ఆస్ట్రేలియా మైదానాలు పేస్ కు సహకరిస్తాయి కాబట్టి..
హేజిల్ వుడ్ బృందాన్ని ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరం. ఆసియా కప్ లో తిలక్ వర్మ అదరగొట్టాడు. పైగా అతని మీద మేనేజ్మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆస్ట్రేలియా గడ్డమీద తిలక్ వర్మ అదరగొడితే అతడికి తిరుగుండదు. ఇక గిల్ టెస్ట్ లలో, వన్డే లలో సత్తా చూపిస్తున్నాడు. టీ 20 లలో మాత్రం విఫలమవుతున్నాడు. సారధి సూర్య కుమార్ యాదవ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గడచిన 7 మ్యాచ్ లలో 72 పరుగులు మాత్రమే చేశాడు. అతడు పూర్వపు ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. హార్దిక్ పాండ్యా గాయపడిన నేపథ్యంలో సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్ లో అదరగొట్టాల్సి ఉంది. వన్డే సిరీస్ కు దూరంగా ఉన్న బుమ్రా టీ 20 లో బౌలింగ్ చేస్తున్న నేపథ్యంలో.. అది భారత జట్టుకు సానుకూలంగా ఉండనుంది.
టిమ్ డేవిడ్, స్టోయినిస్, జోస్ ఇంగ్లిస్ లాంటి ప్లేయర్లతో ఆస్ట్రేలియా బలంగా కనిపిస్తోంది. మిచెల్ మార్ష్ కూడా భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. హెడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ కూడా దుమ్మురేపుతాడు. మిచెల్ ఓవెన్ అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు. వీరందరితో ఆస్ట్రేలియా జట్టు అత్యంత బలంగా ఉంది. వీరిని కట్టడి చేసిన దానినిబట్టే టీమిండియా విజయం ఆధారపడి ఉంటుంది. హేజిల్ వుడ్, బార్టెట్, డ్వార్షయిస్ ఎలీస్ కూడా అదరగొడతారు. జంపా లేకపోవడం టీమిండియా కు కాస్త ఊరట.