Mantha Cyclone Telangana: మొంథా తుఫాను ఏపీలో ఏర్పడింది. తీరం కూడా అక్కడే దాటింది. వాస్తవానికి ఈశాన్య రుతుపవనాలు సమీపించిన వేళ ఈ తుఫాను ఒకరకంగా ఏపీలో భారీ వర్షాలను కురిపించింది అని చెప్పుకోవాలి. అయితే అక్కడి అధికారులు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు విపరీతంగా కురుస్తాయని అనుకున్నారు. కానీ అధికారుల అంచనాలు కూడా తప్పి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలలో కుంభవృష్టి కురిసింది. మొంథా తుఫాను చివరికి తెలంగాణపై కూడా తన ప్రతాపాన్ని చూపింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో బీభత్సంగా వర్షాలను కురిపించింది. వాస్తవానికి ఈ తుఫాను తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి విపత్తుకు కారణమవుతుందని ఎవరూ ఊహించలేదు.
మొంథా తుఫాను గమనాన్ని అంచనా వేసిన వాతావరణ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ తుఫాను గమనం, వేగం, లక్షణాలు వేరుగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి తుఫాన్ తీరం దాటిన తర్వాత కొద్ది గంటల వరకు పరిసర ప్రాంతాల్లో గాలులు విపరీతంగా వీస్తాయి. వర్షాలు కూడా అతి భారీగా కురుస్తాయి. ఈ తుఫాను అంతర్వేదిలో తీరం దాటిన తర్వాత అక్కడ ఎటువంటి ప్రభావం కనిపించలేదు.. ఏపీలోని జంగారెడ్డిగూడెంలో భారీగా వర్షం కురిసింది..ఏలూరు, కోనసీమ, పశ్చిమగోదావరి ప్రాంతాలలో ఊహించిన స్థాయిలో వర్షం కురువలేదు. ఒక అంచనా ప్రకారం ఎక్కడ కూడా 50 మిల్లీమీటర్ల వర్షపాతానికి మించి నమోదు కాలేదు. వాతావరణ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం తుఫాను “ఐ” ప్రాంతంలో 50 కిలోమీటర్ల దూరంలో క్లౌడ్ వాల్స్ ఏర్పడతాయి. క్లౌడ్ వాల్స్ వల్ల పరిసర ప్రాంతాల్లో విపరీతంగా గాలులు, అతి భారీ వర్షాలు కురుస్తాయి.
తీరం దాటిన తర్వాత
తుఫాన్ తీరం దాటిన తర్వాత అంతర్వేది ప్రాంతానికి దాదాపు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావలి వద్ద అత్యధికంగా వర్షాలు కురిపించే మేఘాలు ఏర్పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయింది. వాస్తవానికి తుఫాన్ ఏర్పడిన తర్వాత దానికి కుడి వైపు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులు వీస్తాయి. అయితే అంతర్వేదికి కుడివైపున కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురవలేదు. అయితే విశాఖపట్నంలో ద్రోణి ప్రభావం వల్ల భారీగా వర్షం కురిసింది.
అనూహ్యంగా మార్పులు..
మొంథా తుఫాను సముద్రంలో బాధపడినప్పటి నుంచి గంటకు 15 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది. అందువల్లే ఎక్కువ ప్రభావం చూపించలేకపోయింది. దీనికి తోడు తక్కువ సమయంలోనే గాలుల వేగంలో మార్పు వచ్చింది. తుఫాను తీరం దాటిన తర్వాత మేఘాలు అనూహ్యంగా ముందుకు కదిలాయి. ఆ తర్వాత తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్ ప్రాంతాలలో స్థిరపడిపోయి.. కుంభవృష్టి కురిపించాయి. దీంతో ఈ ప్రాంతాలలో 21 నుంచి సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వాస్తవానికి అక్టోబర్ చివరి వారంలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం దాదాపు అరుదు. రాష్ట్రంలో ఈ ఏడాది అంతగా వర్షాలు కురవలేదు. పంటలు చేతికి వచ్చే సమయంలో కురిసిన వర్షాల వల్ల నష్టం తీవ్రంగా ఉంది.. చేతికి వచ్చిన పంటలు నీటిపాలయ్యాయి. దీంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి.