Thalliki Vandanam
Chandrababu: విద్యా సంవత్సరం ప్రారంభమైంది. తరగతులు ప్రారంభమై నెల రోజులవుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల వసూలు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పిల్లల చదువు సాయానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో విద్యార్థుల చదువుకు నగదు సాయం చేసిన సంగతి తెలిసిందే. అమ్మఒడిని తల్లికి వందనం పేరిట పేరు మార్చి అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు ప్రారంభించింది. తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అమలు దిశగా అడుగులు వేస్తోంది.
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకవైపు సాధారణ పాలన, మరోవైపు పోలవరం, అమరావతి వంటి వాటిపై ప్రత్యేక దృష్టి, ఇంకో వైపు సంక్షేమ పథకాలను సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రాధాన్యతాంశాలుగా తీసుకుని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ ప్రకటన, పింఛన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లు తదితర హామీలు నెరవేర్చే పనిలో ఉంది ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టింది. కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. నవరత్నాల్లో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. తొలుత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమంది చదువుకు సాయం చేస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకరికే పరిమితం చేశారు. తొలి ఏడాది 15 వేల రూపాయలు అందించారు. కానీ తరువాత ఏడాది 1000 రూపాయలు తగ్గించారు. పాఠశాల నిర్వహణ పేరిట కోత విధించారు. చివరి రెండు సంవత్సరాలు అయితే.. ఏకంగా రూ.2000 చొప్పున కొత్త విధించడం విశేషం. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయలు చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో అమలు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. అందుకు అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.
తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి డబ్బుల కోసం లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు సైతం అవకాశం కల్పించారు. ఆధార్ వచ్చేవరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ లేదా పోస్టల్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్ బుక్, ఆ వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసిల్దార్ ఇచ్చే పత్రం.. ఇలా పలు డాక్యుమెంట్లను అనుమతిస్తామని పేర్కొంది.
తల్లికి వందనం పేరిట విద్యార్థికి అందించే సాయానికి షరతులు విధించింది ప్రభుత్వం. కచ్చితంగా దారిద్ర రేఖకు దిగువన ఉండాలి. తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి 15000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే ఈ సాయం పొందాలంటే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు స్టూడెంట్ కిట్ అందించనున్నారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఇంగ్లీష్ డిక్షనరీ, మూడు జతల యూనిఫాం, బెల్టు తో పాటు ఒక జత బూట్లు అందజేయనున్నారు. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెలరోజులు గడుస్తోంది. ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడంతో.. తల్లిదండ్రులు ధ్రువపత్రాలు సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap government green signal for thalliki vandanam scheme
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com