AP Government : ఏపీ ప్రభుత్వం ( AP government) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల మహిళా పోలీసులకు కీలక అవకాశం కల్పించనుంది. వారు మాతృ శాఖను ఎంచుకునే ఛాన్స్ ఇవ్వనుంది. మహిళ శిశు సంక్షేమ శాఖ లేదా హోం శాఖను ఎంచుకునే ఆప్షన్ ఇచ్చింది. మొదటి శాఖను ఎంచుకుంటే ఐసిపిఎస్, మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలు ఉండనున్నాయి. హోం శాఖను ఎంచుకుంటే మాత్రం ఫిజికల్ టెస్ట్ ద్వారా పదోన్నతులు పొందే వీలుంటుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఐదేళ్ల కిందట సచివాలయ ఉద్యోగులు నియమితులయ్యారు. అందులో భాగంగా గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు మహిళా పోలీసులను నియమించారు. అయితే వీరు ఏ శాఖ పరిధిలోకి వస్తారో మాత్రం స్పష్టత లేదు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : అటువంటి వారికి 50% రాయితీ ఇస్తూ గుడ్ న్యూస్ తెలిపిన ప్రభుత్వం.. తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి..
* కూటమి ప్రభుత్వం ఫోకస్..
ప్రస్తుతం సచివాలయ మహిళా పోలీసులు( Sachivalaya ladies police ) ఏ శాఖ పరిధిలో పని చేస్తున్నారో తెలియడం లేదు. అందుకే దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ లేదా హోం శాఖలో ఏదో ఒక దాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఒకవేళ మహిళ శిశు సంక్షేమ శాఖను ఎంచుకుంటే ఐసిపిఎస్, మిషన్ శక్తి పర్యవేక్షణ బాధ్యతలు వారికి అప్పగిస్తారు. హోం శాఖను ఎంచుకుంటే మాత్రం వీరిని పోలీస్ సిబ్బంది గా పరిగణిస్తారు. ఫిజికల్ టెస్ట్ ద్వారా పదోన్నతులు పొందే అవకాశం కల్పిస్తారు. దీనిపై గ్రామ/ వార్డు సచివాలయాల శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 13912 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వీరికి మాతృ శాఖ కేటాయింపులపై కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది.
* పదోన్నతులకు రంగం సిద్ధం..
2019 అక్టోబర్ 2న సచివాలయ వ్యవస్థ( Sachivalaya system ) ప్రారంభం అయింది. అప్పట్లోనే మహిళా పోలీసులను ఎంపిక చేశారు. కానీ వీరు ఏ శాఖ పరిధిలో పని చేస్తారో తెలియదు. అందుకే వీరికి ఎటువంటి పదోన్నతులు లభించలేదు. ఇప్పుడు ప్రమోషన్లు సిద్ధమవుతున్న వేళ వీరు శాఖల ఎంపిక కీలకం. హోం శాఖలో కొనసాగాలనుకునే వారికి తప్పకుండా ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో, మిగిలిన వారిని మినిస్ట్రీయల్ పోస్టుల్లో నియమిస్తారు. ఇప్పటివరకు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే మహిళా పోలీసుల పదోన్నతుల ప్రక్రియ కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఐసిడిఎస్ ప్రాజెక్టు క్లస్టర్ విధానాన్ని కొత్తగా ప్రతిపాదించారు. దీని ప్రకారం తొలి క్లస్టర్ స్థాయిలో మహిళా పోలీస్ గా తీసుకుంటారు. ఆ తర్వాత మండల స్థాయిలో, ఆపై డివిజనల్ స్థాయిలో పదోన్నతులు ఉంటాయి.
* ఎటువైపు మొగ్గు..
హోం శాఖలో మహిళా పోలీసులు చేరితే వారిని పోలీసులుగా పరిగణిస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు( women children welfare department) కేటాయిస్తే మాత్రం శిశు గృహాలు, జువైనల్ హోమ్ లు ఉంటాయి. మిషన్ శక్తి కింద బాల్యవివాహాలను నియంత్రించడం, పని ప్రదేశంలో పిల్లల సంరక్షణ కేంద్రాల పర్యవేక్షణ వంటి బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఎక్కువమంది ఐసిడిఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మహిళా శిశు సంక్షేమ శాఖ అయితే సేఫ్ జోన్ అని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ఈ 13 వేల మందికి పైగా మహిళా ఉద్యోగులు ఏ శాఖ వైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది
Also Read : మూడో విడత నామినేటెడ్ పదవులు రెడీ.. ఈసారి వారికి లేనట్టే!