IPS Officers Transfer In AP: ఏపీ ప్రభుత్వం( AP government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎస్ అధికారుల బదిలీ చేపట్టింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వంతు ఐపీఎస్ అధికారులకు వచ్చింది. సాధారణ బదిలీల్లో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు ఐపిఎస్ అధికారుల బదిలీపై కసరత్తు చేశారు. అది పూర్తయిన తర్వాత శనివారం ఐపీఎస్ అధికారుల బదిలీపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించగా.. అందులో ఏడు చోట్ల కొత్త వారిని నియమించారు. మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు. మిగతా 12 జిల్లాల్లో మాత్రం పాత ఎస్పీలనే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
నియమితులైంది వీరే..
కృష్ణాజిల్లా( Krishna district) ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, పల్నాడు జిల్లా ఎస్పీగా కృష్ణారావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా నియమితులయ్యారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కునుగులి, నంద్యాల జిల్లా ఎస్పీగా సునీల్ షరాన్, బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వరరావును నియమించారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా అజిత వేజెండ్ల, విజయనగరం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్, తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్, వైయస్సార్ కడప జిల్లా ఎస్పీగా నచికేత్, సత్యసాయి జిల్లా ఎస్పీ గా సతీష్ కుమార్, చిత్తూరు ఎస్పీగా తుషార్ డుడి నియమితులయ్యారు.
* 12 జిల్లాలకు పాత వారే..
మరోవైపు మరో 12 జిల్లాలకు పాత ఎస్పీలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు,కాకినాడ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాలో మాత్రం ఎస్పీలు యధాతధంగా కొనసాగుతారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తర్వాత ఎస్పీగా ఉన్న సుబ్బరాయుడు పై బదిలీ వేటు జరిగింది. ఇప్పుడు మరోసారి అదే జిల్లాకు సుబ్బారాయుడును నియమించడం విశేషం. ఇప్పటివరకు తిరుపతి ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజు ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు. మొత్తానికి అయితే ఏపీ ప్రభుత్వం భారీ ప్రక్షాళనకు దిగినట్టే.