Ind Vs Pak Asia Cup 2025: పహల్గాం దాడి తర్వాత టీమిండియా, పాకిస్తాన్ ఆసియా కప్ లో పరస్పరం తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వాస్తవానికి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఉద్రిక్తత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు అంచనాలను అమాంతం పెంచుకుంటారు. టీవీలలో, మైదానాలలో మ్యాచ్ చూసేందుకు పోటీ పడుతుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈసారి మ్యాచ్ విషయంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో విరుద్ధమైన ప్రచారం జరుగుతోంది.
ఆసియా కప్ ప్రసార హక్కులు దక్కించుకున్న సోనీ గ్రూప్ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ విషయంలో భారీ అంచనాలను పెట్టుకుంది. ఈ మ్యాచ్ ద్వారా వాణిజ్య ప్రకటనలు భారీగా వస్తాయని ఆశాభావంతో ఉంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే సామాజిక మాధ్యమాలలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ సరికాదని ఏకంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. శుక్రవారం నుంచి బైకాట్ ఆసియా కప్ అనే హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. చాలామంది పహల్గాం దాడిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులను చంపి పచ్చటి కాశ్మీర్లో నెత్తుటి ఏర్లను పారించారని.. అటువంటి వ్యక్తులను ఎగ దోసిన జట్టుతో క్రికెట్ ఆడటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు..
ఇటీవల లెజెండ్స్ క్రికెట్ టోర్నీ జరిగింది. ఆటోర్నీలో టీమిండియా కూడా ఆడింది. పాకిస్తాన్ జట్టుతో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత ప్లేయర్లు ఆడలేదు. దీంతో పాకిస్తాన్ నేరుగా ఫైనల్ వెళ్లిపోయింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ఆడే క్రమంలో భారత ఆటగాళ్లు కీలకై వ్యాఖ్యలు చేశారు. నెత్తురు, నీళ్లు కలిసి ప్రవహించలేవని పేర్కొన్నారు. ఉగ్రవాదులతో క్రికెట్ ఆడేది లేదని.. తమకు దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు. అప్పట్లో భారత్ ప్లేయర్లు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అయింది. ఇప్పుడేమో టీమిండియా ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టుతో ఆసియా కప్ లో ఆడటం పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. వాస్తవానికి పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ అంటే భారత అభిమానులకు ఎక్కడా లేని ఆనందం ఉంటుంది. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఒకవేళ నిరసన ఇలానే కొనసాగితే మ్యాచ్ జరుగుతుందా? మ్యాచ్ జరగడానికి అవకాశం ఉంటుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.