AP Elections 2024: ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్డు షోలతో హోరెత్తిస్తున్నారు. అయితే కూటమి ప్రచార సభలతో పోల్చుకుంటే.. వైసిపి ప్రచారం వెనుకబడి ఉంది.కేవలం జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీకి మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా సెలబ్రిటీలు రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీకి ఇది లోటే. ఇక కూటమి ప్రచార సభలు జోరుగా సాగుతున్నాయి. వాటి ముందు వైసీపీ సభలు వెలవెలబోతున్నాయి.
గత ఎన్నికల్లో జగన్, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతి, సినిమా స్టార్లు మోహన్ బాబు, అలీ, పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, చిన్నాచితకా నటులు.. ఇలా ఒకరేమిటి ప్రచారంతో హోరెత్తించారు. ఆ ఎన్నికల్లో జగన్ క్షణం తీరిక లేకుండా గడిపారు. దాదాపు 175 నియోజకవర్గాలను ప్రచారంలో కవర్ చేశారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జగన్ ఒక్కరే ప్రచార సభలతో గడపాల్సిన పరిస్థితి దాపురించింది. గత ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించిన వైసిపి.. ఈసారి మాత్రం అటువంటి ప్రయత్నం చేయలేదు.
కూటమి నుంచి భారీ బహిరంగ సభలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్, ఇంకోవైపు బాలకృష్ణ, లోకేష్ లు భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. నాగబాబు, 30 ఇయర్స్ పృథ్వి, క్రికెటర్ అంబటి రాయుడు, జబర్దస్త్ నటులు హైపర్ ఆది, గెటప్ శీను.. ఇలా ఎందరో స్టార్ క్యాంపైనర్లుగా మారి ప్రచారం చేస్తున్నారు. మొన్నటికీ మొన్న బస్సు యాత్రచేపట్టిన జగన్ ఉన్న సమయాన్ని వృధా చేశారన్న కామెంట్స్ సొంత పార్టీలోనే వినిపిస్తోంది.175 నియోజకవర్గాలకు గాను కేవలం 75 నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర చేపట్టారు.అయితే అక్కడ భారీ బహిరంగ సభలకు అవకాశం లేకుండా పోయింది. జన సమీకరణకు తావు లేకుండా పోయింది. ఇది ఇబ్బందికరంగా మారింది. మరోవైపు ప్రచారం తుది అంకానికి చేరుకోగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలాంటి అగ్రనేతలు ఏపీకి క్యూ కట్టనున్నారు. మొత్తానికైతే వైసీపీ అభ్యర్థులు తమకు తాముగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కూటమిలో అయితే స్టార్ క్యాంపెయినర్లు జోష్ నింపుతున్నారు.