AP Elections 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. అంటే కేవలం ప్రభుత్వానిది ప్రేక్షక పాత్ర. ఎలక్షన్ కమిషన్ సుప్రీం. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వమే సుప్రీం గా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల కంటే.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలనే కొంతమంది అధికారులు పాటిస్తున్నారు. ఎన్నికలవేళ శాంతిభద్రతలు సైతం దిగజారుతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలుగా ప్రధాన కార్యదర్శి, డీజీపీలు వ్యవహరించాలి. కానీ వారు నోరు తెరవడం లేదు. అయితే తమను మార్చేస్తారన్న ప్రచారంతోనే వారు మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న ఈ సమయంలో చిత్రవిచిత్రాలు ఏపీలో చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థులుగా పోటీ చేసేవారు తమపై ఉన్న కేసుల వివరాలు అడిగితే ఇవ్వడానికి నిరాకరించారు. పోలీస్ సేవ యాప్ కూడా పనిచేయడం లేదు. చివరకు కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఇటువంటి సమయంలో అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తారా? అంటే కాదనే సమాధానం వినిపిస్తోంది. కానీ ఈ మాటలను ఎలక్షన్ కమిషన్కు వినిపించకపోవడం మాత్రం విచారకరం.
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరుపై ఎలక్షన్ కమిషన్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళుతున్నాయి. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ సమీపిస్తోంది. ఈ తరుణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే కీలక అధికారుల బదిలీ తప్పనిసరి. కానీ ఈ బదిలీల విషయం లీకులు బయటకు వస్తున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. సి ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ని మార్చుతారని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. వారి తరువాత స్థానాల్లో ఉన్న సిసోడియా, ద్వారకాతిరుమలరావును నియమిస్తారని అంతా భావించారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తే సీనియార్టీ జాబితాలో ముందుంటారు. ఆయన డిజిపి కావాలని టిడిపి సహజంగానే కోరుతోంది
. పోనీ ఆ పని చేయకపోయినా.. సిఎస్, డీజీపీలను మార్చితేనే విపక్షాలకు నమ్మకం కుదురుతుంది. ఎన్నికలు సవ్యంగా జరుగుతాయన్న టాక్ వినిపిస్తోంది. మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.