AP Cricket: ఏపీలో క్రికెట్ అభివృద్ధికి బలమైన చర్యలు చేపడుతోంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్( Andhra Cricket Association). క్రికెట్ పరిధిని మరింత విస్తరించాలని.. ఏపీలో అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఏసీఏ భావిస్తోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన క్రికెట్ రంగం అభివృద్ధి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 72వ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా 25 జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు.
Read Also: డేంజర్ జోన్ లో ఆ 17 మంది.. సంచలన సర్వే!
* క్రికెట్ విస్తరణ పై చర్చ
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం హయాంలో క్రికెట్ క్రీడా పరంగా సరైన నిర్ణయాలు తీసుకోలేదన్న విమర్శ ఉంది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఆధునిక క్రికెట్ మైదానాల నిర్మాణం లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ లీగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మరిన్ని మ్యాచ్ ల నిర్వహణకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. మరిన్ని ఫ్రాంచైజీలను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని వివరించారు.
* ఇక ఏడాదిలో 200 మ్యాచ్ లు
రాష్ట్రంలో 25 జిల్లాల్లో ఏడాదికి కనీసం 200 రోజులపాటు మ్యాచ్ లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు కేశినేని శివనాథ్( MP sivanath ) స్పష్టం చేశారు. అమరావతిలో క్రీడా నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కూడా తెలిపారు. వాటిలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం కూడా ఉంటుందని వివరించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర మంత్రి లోకేష్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ సహాయంతో ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ తో ప్రాథమిక చర్చలు జరిగినట్లు కూడా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా వన్డే వరల్డ్ కప్ క్రికెట్ పోటీలకు వేదిక కావడం గర్వకారణమని ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్లో విశాఖపట్నంలో ఈ మ్యాచ్లు జరగనున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర క్రీడాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
Read Also: కెసిఆర్ ని పలకరించని లోకేష్.. నిజం ఎంత?
* నిధుల కేటాయింపు పెంపు..
మరోవైపు రాష్ట్రంలోని 25 జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి( cricket development) తీసుకోవాల్సిన అంశాలపై ఈ వార్షిక సమావేశంలో చర్చించారు. ప్రధానంగా జిల్లా క్రికెట్ సంఘాలకు సంవత్సరానికి ఇచ్చే నిధులను రూ.20 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచారు. అనుబంధ క్రికెట్ క్లబ్ లు స్వయంగా ప్రాంతీయ పోటీలు నిర్వహించాలి అనే ప్రతిపాదనను కూడా తీసుకొచ్చారు. మరోవైపు ఎన్నో అంచనాలకు కేంద్ర బిందువుగా ఏసీఏ సమావేశం జరిగింది. సానుకూల వాతావరణం లో సాగింది. సమావేశంలో ఏసీఏ ఉపాధ్యక్షుడు వెంకట రమా ప్రశాంత్, మహిళా ప్రతినిధి గీత, మాజీ క్రికెటర్ ఎమ్మెస్ కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.