AP govt decision on IPS officers: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన చాలామంది అధికారులు ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రాధాన్యత లేని పోస్టుల్లో పెట్టారు. కొందరికైతే ఎటువంటి పోస్టులు కూడా ఇవ్వలేదు. ఇంకా సస్పెన్షన్ వేటు లోనే ఉన్నారు. ఓ ముంబై నటిపై అక్రమ కేసు బనాయించి.. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను వేధించిన కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. తాజాగా ఇద్దరు ఐపీఎస్ అధికారుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వైసిపి హయాంలో ముంబై నటిపై వేధింపులకు పాల్పడ్డారు. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో కొందరు అధికారులు అతిగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి.
విచారణ కమిటీ సూచనలతో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇంటలిజెన్స్ అధికారిగా పిఎస్సార్ రామాంజనేయులు ఉండేవారు. కాంతిరాణా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్ గా వ్యవహరించేవారు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ముంబై నటిని కేసులపరంగా ఇబ్బంది పెట్టారని కూటమి ప్రభుత్వం గుర్తించి ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలకు దిగింది. ఈ కారణంగానే పిఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు కూడా వెళ్లారు. కాంతి రాణాకు అనారోగ్యం కారణంగా బెయిల్ వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో ముంబై నటి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. మరోవైపు వీరిపై విచారణకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇంకా ఈ కమిటీ విచారణ పూర్తి కాలేదు. అందుకే వీరిపై సస్పెన్షన్ ఎత్తివేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది.
మరికొంత కాలం వేటు..
అయితే విచారణ కమిటీ సూచనల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ముగ్గురు అధికారుల సస్పెన్షన్ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వీరంతా సస్పెన్షన్ లోనే ఉన్నారు. అదే సమయంలో విశాల్ గున్ని ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందనేది కీలకంగా మారుతోంది. కేవలం వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నడుచుకున్నందుకు ఈ అధికారులంతా మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పట్లో వీరిపై సస్పెన్షన్ వేటు తొలగే అవకాశం లేదు. అయితే కొందరు పదవీ విరమణకు దగ్గరగా ఉన్నారు. మరికొందరు సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులకు దగ్గరగా కూడా ఉన్నారు. అటువంటి వారికి నష్టం జరగక తప్పేలా లేదు.