https://oktelugu.com/

Ys Jagan to Vizag : ఇంత హడావుడిగా విశాఖకు జగన్ షిఫ్ట్ వెనుక కారణం అదే

జగన్ కూడా విశాఖకు వచ్చేస్తానని అనడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ‘‘అమరావతిలో ఏమీ లేదు కాబట్టి అభివృద్ధి జరగడానికి 75 సంవత్సరాలు పడుతుంది. విశాఖలో ఇప్పటికే అన్నీ ఉన్నాయి.. కాబట్టి 25 యేళ్లలో పూర్తి స్థాయి రాజధానిగా మారిపోవడానికి అవకాశం ఉంది’’ అని వైసీపీ నాయకులు అంటున్నారు.

Written By:
  • SHAIK SADIQ
  • , Updated On : May 7, 2023 / 03:59 PM IST
    Follow us on

    Ys Jagan to Vizag : వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆ మేరకు వడివడిగా అడుగులు వేస్తున్న ఆయన విశాఖను అంతర్జాతీయ స్థాయిలో రాజధానిగా చేస్తానని అంటున్నారు. కార్పొరేట్ సంస్థలన్నింటినీ అక్కడ మోహరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ఆయన కూడా అక్కడకు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తొందర ఎందుకు అన్న ఆలోచనలు మొదలయ్యాయి.

    గత తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడిగా హైదరాబాదును రాజధానిగా అని చెప్పినా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక రాజధాని అవసరం. ఆ మేరకు భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని, మేథోమథనం అనంతరం అమరావతిని ఏపీకి రాజధానిగా ప్రకటించారు. మంగళగిరి, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో వేల ఎకరాలను సేకరించారు. తాత్కాలికంగా సచివాలయం, హైకోర్టును ఏర్పాటు చేశారు. అత్యున్నత ప్రమాణాలతో రాజధాని నిర్మాణం జరిగేలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళిక రచించారు. అందుకు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా సమ్మతించారు. అమరావతి ప్రాంతంలో ఇల్లును కూడా కట్టుకున్నారు. ప్రధాని మోడీ కూడా ఢిల్లీ నుంచి జలాలను తీసుకొచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ఆ తరువాత ప్రభుత్వం మారడం వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ వెంటనే ఆయన రాజధానిగా అమరావతి వద్దని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని మూడు రాజధానులు ఉండాలని  సూచించారు. కర్నూలును జ్యూడీషియల్, విశాఖను పరిపాలన, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిని ప్రతిపక్షాలు ఆక్షేపించడంతో వివాదం మొదలైంది. అమరావతిలో భూములిచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. విషయం హై కోర్టుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది. అమరావతి రైతులు కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. త్వరలో తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాబోతున్నట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు.

    కాగా, మొదట మూడు రాజధానులు అన్న వైసీపీ అధినాయకత్వం ఇప్పుడు విశాఖ పైనే దృష్టి పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను ఉత్తరాంధ్రలోనే ప్రారంభించారు. విశాఖలోనే గ్లోబల్ సమ్మిట్, జీ20 సదస్సును ఏర్పాటు చేశారు. కార్పొరేట్ సంస్థలన్నింటినీ ఇక్కడికే వస్తాయని అంటున్నారు. జగన్ కూడా విశాఖకు వచ్చేస్తానని అనడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ‘‘అమరావతిలో ఏమీ లేదు కాబట్టి అభివృద్ధి జరగడానికి 75 సంవత్సరాలు పడుతుంది. విశాఖలో ఇప్పటికే అన్నీ ఉన్నాయి.. కాబట్టి 25 యేళ్లలో పూర్తి స్థాయి రాజధానిగా మారిపోవడానికి అవకాశం ఉంది’’ అని వైసీపీ నాయకులు అంటున్నారు.

    వైసీపీ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖను రాజధాని అన్న ఆ ప్రాంతవాసులు నమ్మడం లేదు. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదాహరణ. అప్పుడో మాట ఇప్పుడో మాట అనడం ఏమిటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి జగన్ విశాఖను రాజధాని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటి వరకు సంక్షేమంపై దృష్టి పెట్టిన ఆయన అభివృద్ధి గురించి మాట్లాడటం వెనుక ఐ ప్యాక్ టీం ఉందనడంలో సందేహం లేదు. మొత్తంగా చూసుకుంటే జగన్ ఇంత హడావుడిగా విశాఖపై దృష్టి పెట్టడం స్వ ప్రయోజనాల కోసమే తప్ప మరో కారణం లేదని స్పష్టంగా తెలుస్తోంది.