AP CM Chandrababu : రాజకీయాల్లోకి వచ్చాక శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు శత్రువులుగా మారుతారు. అయితే అదంతా సైద్ధాంతిక పరంగానే. వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి చాలామంది నేతలు స్నేహాన్ని కొనసాగిస్తారు. అలాంటి స్నేహితులే దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు. ఇద్దరి పొలిటికల్ కెరీర్ ఒకసారే ప్రారంభం అయ్యింది. 1978లో ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇద్దరూ మంత్రులయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులుగానే పోటీ చేశారు. అయితే చంద్రబాబు టీడీపీలోకి వెళ్లాక ఇద్దరు దారులు వేరయ్యాయి. అప్పటివరకు ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మెలిగారు.కానీ వేరువేరు పార్టీలు కావడం,ప్రత్యర్థి పార్టీలు కావడంతో వారి మధ్య దూరం పెరిగింది.కానీ స్నేహం మాత్రం కొనసాగింది.1995లో చంద్రబాబు సీఎం అయ్యేనాటికి సీఎల్పీ నేతగా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అప్పటినుంచి వారి మధ్య రాజకీయ వైరం ప్రారంభమైంది. 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలో విపక్ష నేత పాత్ర పోషించారు రాజశేఖర్ రెడ్డి. ఇద్దరి మధ్యరాజకీయ విమర్శలు,ఆరోపణలు నిత్య కృత్యం అయ్యాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకునేవారు. 2004 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో సైతం రెండోసారి రాజశేఖర్ రెడ్డి గెలిచారు. అయితే చంద్రబాబు సీఎం గా ఉన్నా.. తరువాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా వారి మధ్య రాజకీయ విభేదాలు తప్ప.. వ్యక్తిగత స్నేహం మాత్రం కొనసాగింది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పుకొచ్చారు చంద్రబాబు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తూ.. అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్.. మొదటి షో కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
* క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయి
1995 నుంచి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో రాజశేఖరరెడ్డి విపక్ష పాత్ర పోషించారు. రాజశేఖర్ రెడ్డి చాలా సందర్భాల్లో చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా దూకుడు ప్రదర్శించారు. ఒకటి రెండుసార్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి నోటి నుంచి తప్పుడు మాటలు కూడా వచ్చిన పరిస్థితులు ఉండేవి.అయితే అలా తప్పులు దొర్లినప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు క్షమాపణలు కూడా చెప్పారని తాజాగా చంద్రబాబు చెప్తున్నారు.తమ మధ్య రాజకీయ విభేదాలు తప్ప కక్ష సాధింపులు లేవని గుర్తు చేశారు చంద్రబాబు.కానీ జగన్ విషయంలో అలా కాదని చెప్పుకొచ్చారు.
* అరెస్టు చేసిన తీరు బాధాకరం
తనపై కక్ష సాధింపుతో ఆధారాలు లేని కేసుల్లో అరెస్టు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు.అవినీతి కేసులో గత ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబును సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.నంద్యాలలో ఓ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేసి.. రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చిన సంగతి విధితమే. దానిని గుర్తు చేస్తూ ఎమోషనల్ అయ్యారు చంద్రబాబు. అరెస్టు చేసే తీరు తనను కలచి వేసిందని.. అప్పుడే తన కర్తవ్యం గుర్తుకొచ్చిందనిచెప్పుకొచ్చారు చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డిలో స్నేహం కనిపించేదని.. రాజకీయ హుందాతనం ఉండేదని.. కానీ జగన్ లో మాత్రం అదేది కనిపించలేదని గుర్తు చేశారు చంద్రబాబు. మొత్తానికి అయితే బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో మనసు విప్పి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు చంద్రబాబు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ap cm chandrababu shared his experiences of prison life and ys rajasekhar reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com