CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu) అకస్మాత్తుగా ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర పెద్దల పిలుపుమేరకు ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో కుంభమేళాలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కుమారుడితో కలిసి పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆయన సైతం అక్కడి నుంచి అటే ఢిల్లీ చేరుతారని తెలుస్తోంది. రెండు రోజులపాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కానీ దానిని సైతం వాయిదా వేసుకుని సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఢిల్లీ పడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారని తెలుస్తోంది. పనిలో పనిగా మిగతా కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది.
* ప్రమాణ స్వీకారానికి హాజరు
అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) హాజరవుతారని తెలుస్తోంది. అందుకే హుటాహుటిన వారు ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. రేపు సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానించింది భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏలో జనసేన సైతం కీలక భాగస్వామి కావడంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు. అందుకే ఆయన సైతం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకరోజు ముందుగానే ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్తుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.
* బిజెపి ఘనవిజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో( Delhi Assembly elections ) బిజెపి ఘన విజయం సాధించింది. 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బిజెపి జెండా ఎగిరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలు నివాసముండే అత్యధిక నియోజకవర్గాల్లో వీరిద్దరూ ప్రచారం చేశారు. అటువంటి ప్రాంతాల్లో బిజెపికి అనుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో బీజేపీ పెద్దలు ఈ ఇద్దరు నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆహ్వానాలు పంపారు. బిజెపితోపాటు ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సినీ సెలబ్రిటీలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
* ముఖ్యమంత్రి పేరు పై వీడని మిస్టరీ..
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి( Delhi Chief Minister) ఎవరనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకుండానే బిజెపి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. ఇప్పుడు ఘన విజయం సాధించడంతో అనేక రకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు రేఖ గుప్తా పేరు సైతం ప్రాచుర్యంలో ఉంది. ఇటువంటి తరుణంలో ఈరోజు మధ్యాహ్నం బిజెపి శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి పేరు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.