AP Cabinet: నాలుగు గంటల పాటు సాగిన ఏపీ క్యాబినెట్.. తీసుకున్న నిర్ణయాలు ఇవే!

AP Cabinet: జగన్ సర్కార్ అన్ని వ్యవస్థలు, శాఖలు నిర్వీర్యం చేశారని భావించిన ప్రభుత్వం ముందుగా 7 ప్రధాన శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది.

Written By: Dharma, Updated On : June 24, 2024 4:29 pm

AP Cabinet Takes Key Decisions

Follow us on

AP Cabinet: ఏపీ తొలి క్యాబినెట్ సమావేశం ముగిసింది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక 5 ఫైళ్లపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. వీటిపైనే ప్రధానంగా చర్చించారు. మెగా డీఎస్సీ నిర్వహణ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, నైపుణ్య గణనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూలై 1న మెగా డీఎస్సీ నిర్వహణ ప్రారంభించి.. డిసెంబర్ 10 కల్లా ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏపీలో వివాదాస్పదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. సామాజిక పింఛన్ల మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంపును కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను తెరవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు నైపుణ్య గణనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. విజయవాడలోని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ గా మార్చాలని కూడా నిర్ణయం తీసుకుంది. నాలుగు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఐదు అంశాలే కాకుండా.. కీలక నిర్ణయాలు దిశగా మంత్రిమండలి అడుగులు వేసింది.

వైసిపి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించడానికి కూడా నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ అన్ని వ్యవస్థలు, శాఖలు నిర్వీర్యం చేశారని భావించిన ప్రభుత్వం ముందుగా 7 ప్రధాన శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్, విద్యుత్ శాఖలపై ఈ నెలాఖరు నుంచి శ్వేత పత్రాలు విడుదల చేయాలని క్యాబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది. రాష్ట్రంలో గంజాయి నియంత్రణపై ఫోకస్ పెంచాలని కూడా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యింది. ఎందుకుగాను ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో మంత్రులు అనిత, లోకేష్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉంటారు.

Also Read: Lok Sabha: లోక్ సభలో ఉట్టిపడిన తెలుగుదనం. ప్రత్యేక ఆకర్షణగా ఎంపీలు

పింఛన్ల పంపిణీ పై సైతం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టాలని.. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటన తర్వాత.. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి పింఛన్ల పంపిణీ పై ఒకరకమైన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వాలంటీర్లు వైసీపీ సానుభూతిపరులు కావడంతో వారి సేవలను నిలిపివేశారు. దీంతోఒక రకమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి.ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.జూలై 1న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వేడుకగా జరపనున్నారు.

Also Read: AP Cabinet : నిరుద్యోగులకు ఏపీ క్యాబినెట్ గుడ్ న్యూస్

క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమకు కేటాయించిన శాఖలపై వీలైనంత త్వరగా పొట్టు పెంచుకోవాలని సూచించారు. ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా చూసుకోవాలన్నారు. వారందరికీ కీలక సూచనలు చేశారు. కాగా అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.