Lok Sabha: లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెమ్ స్పీకర్ భర్త్రుహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మాతృభాషలో ప్రమాణం చేయడం విశేషం. ముందుగా ఎన్డీఏ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులుగా ఎన్నికైన కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రి మండలి సభ్యుల ప్రమాణం పూర్తయిన తర్వాత ఆంగ్ల అక్షరమాల క్రమం ప్రకారం ఎంపీలు ప్రమాణం చేశారు.
Also Read: AP Cabinet : నిరుద్యోగులకు ఏపీ క్యాబినెట్ గుడ్ న్యూస్
తొలుత ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఎంపీలకు అవకాశం వచ్చింది.చాలామంది తెలుగులోనే ప్రమాణం చేశారు. వీరిలో మతుకుమిల్లి శ్రీ భరత్, కలిశేట్టి అప్పలనాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. మిగతావారు హిందీ, ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. 21 పార్లమెంటు స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. వైసిపి కేవలం నాలుగు పార్లమెంట్ స్థానాలకే పరిమితం అయ్యింది. కేంద్ర క్యాబినెట్లో ఏపీ నుంచి ముగ్గురు అవకాశం దక్కింది. కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా దక్కగా..పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయ మంత్రి హోదా దక్కింది. బిజెపికి చెందిన నరసరావుపేట ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు సైతం సహాయ మంత్రి పదవి దక్కడం విశేషం.
Also Read: Revanth Reddy: కేసీఆర్ చేసిన తప్పే.. రేవంత్ చేస్తున్నాడు.. రిజల్డ్ రిపీట్!
అయితే సభలో ఈరోజు వైసిపి హడావిడి ఎక్కడా కనిపించలేదు. కూటమి పార్లమెంట్ సభ్యులు మాత్రం ఉత్సాహంగా కనిపించారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, ఏపీకి చెందిన కలిసేట్టి అప్పలనాయుడు మాత్రం తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పంచె కట్టుతో సభలోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉభయ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఎక్కువగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. రాష్ట్రాలు వేరైనా మనమంతా తెలుగువారమేనని చాటేలా.. ఎంపీలు వ్యవహరించడం గమనార్హం.