Daggubati Purandheswari : చిన్నమ్మతో ‘కమల’ వికాసం సాధ్యమేనా?

ఇప్పుడు పొత్తులు, ఉన్నా లేకున్నా పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారు? పార్టీ ఓటింగ్ ను ఎలా పెంచగలరు? అన్న సవాళ్లు చిన్నమ్మ ముందున్నాయి. వాటిని ఎలా అధిగమించగలరో చూడాలి మరీ.  

Written By: Dharma, Updated On : July 13, 2023 6:51 pm
Follow us on

Daggubati Purandheswari : ఏపీ బీజేపీ చీఫ్ గా చిన్నమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి ఫుల్ పవర్స్ తీసుకున్నారు. వారం, వర్జ్యం, ముహూర్తం చూసుకొని బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడో వారం కిందట హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చినా అషాడ మాసం సెంటిమెంట్ తో ఆలోచన పడ్డారు. తక్షణం ఆమె నియామకం అమల్లోకి వస్తుందని చెప్పిన హైకమాండ్ కు ఒప్పించి.. సరైన ముహూర్తం వేళ అధ్యక్ష పీఠాన్ని అందుకున్నారు.ఇప్పుడు ఆమె నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది ప్రశ్న. తనదైన టీమ్ తో ఎన్నికల కార్యక్షేత్రంలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. అందుకే మూడు ప్రాంతాల నాయకుల పేర్లతో కూడిన జాబితాను హైకమాండ్ కు పంపించారు.

ఏపీ బీజేపీలో నేతలకు, పెద్దతలకాయలకు కొదువ లేదు. మూడు ప్రాంతాల్లో ఉండే నాయకులు ముప్పై ఆలోచనలతో ఉంటారు. హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందని కొందరు, బీజేపీ పునాదులు నిర్మించామని మరికొందరు, తమకు తిరుగులేని చరిష్మ ఉందని ఇంకొందరు. ఇలా అందర్నీ కోఆర్డినేట్ చేయడం అంటే చాలా కష్టం. భిన్న ఆలోచనలతో ఉండే బీజేపీ నేతలకు రాష్ట్ర అధ్యక్షులంటే చులకన భావం. తమకంటే వారు తోపులు కాదన్నది వారి భావన. ఇంతకు ముందు అధ్యక్ష పదవులు అనుభవించిన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు ఇటువంటి అనుభవాలే ఉన్నాయి.

సాధారణంగా పార్టీలో సీనియర్లు ఉండడం, కేంద్ర నేతలతో సన్నిహితంగా మెలిగిన వారు ఉండడం పార్టీకి లాభిస్తుంది. కానీ ఎందుకో బీజేపీలో మాత్రం రివర్స్ అవుతోంది. పార్టీ అభివృద్ధికి ఎంతమాత్రం ఉపయోగపడడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో తమ వ్యూహాలకు హైకమాండ్ జైకొట్టాలన్న నేతలే అధికంగా కనిపిస్తున్నారు. పైగా పదవులపై అసంతృప్తితో ఉన్నవారు.. ఎలాగైనా చట్టసభలకు ఎన్నిక కావాలని కోరుకుంటున్న వారు పక్క చూపులు చూస్తున్నారు. ఇటువంటి వారిని కట్టడి చేయడంలో చిన్నమ్మ ఎంతవరకూ సఫలీకృతులవుతారో చూడాలి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అంటే బ్యాలెన్స్ గా వెళ్లాలి. లేకుంటే ఇంతకు ముందున్న అధ్యక్షులు మాదిరిగా వైసీపీ, టీడీపీ ముద్రపడే చాన్స్ ఉంది. పైగా ఆమె ఎన్టీఆర్ బిడ్డ. మొన్నటివరకూ వైసీపీ సర్కారు విధానాలను గట్టిగానే వ్యతిరేకించారు. వైసీపీ వరకూ ఫర్వాలేకున్నా.. టీడీపీలో ఎలా వ్యవహరిస్తారన్నదే ఇప్పుడు అసలు సిసలు సమస్య. బీజేపీ అధ్యక్ష పీఠం రాకుంటే ఆమెతో పాటు కుటుంబం టీడీపీకి దగ్గరయ్యుండేదని ఒక టాక్ ఉంది. ఇప్పుడు పొత్తులు, ఉన్నా లేకున్నా పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారు? పార్టీ ఓటింగ్ ను ఎలా పెంచగలరు? అన్న సవాళ్లు చిన్నమ్మ ముందున్నాయి. వాటిని ఎలా అధిగమించగలరో చూడాలి మరీ.