AP BJP – Pawan : ఏపీ రాజకీయ ముఖచిత్రం మారుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులయ్యారు. ఎన్టీఆర్ కుమార్తెగా, రాజకీయ అనుభవశాలిగా గుర్తించిన హైకమాండ్ రాష్ట్ర పగ్గాలు ఆమెకు అప్పగించింది. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టయ్యింది. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై పెను ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకురాలి ఎంపికతో…అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ నాయకత్వానికి సవాల్ చేసినట్టయ్యింది. అయితే బీజేపీ తాజా నిర్ణయంతో జనసేన అధినేత పవన్ డిఫెన్స్ లో పడినట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే వెళతాయని భావించారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ దాని కోసమే బలంగా ప్రయత్నించారు. పవన్ ఢిల్లీ వెళ్లి అగ్రనేతలను సైతం కలిశారు. టీడీపీతో కలిసే వెళదామని ప్రతిపాదన పెట్టారు. చంద్రబాబు సైతం సుదీర్ఘ విరామం తరువాత అమిత్ షాతో సమావేశమయ్యారు. పొత్తుల గురించి చర్చించారు. దీంతో పొత్తు ఖాయమని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు పురంధేశ్వరి నియామకంతో బీజేపీ హైకమాండ్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. వస్తే జనసేన.. లేకుంటే ఒంటరి పోరుకే బీజేపీ ప్రయారిటీ ఇస్తుందన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
అయితే ఈ విషయంలో పవన్ ఎలా ముందుకెళతారో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఇచ్చిన సంకేతాల మేరకు వస్తే పవన్ తోనే అని తేలిపోయింది. పవన్ ఇప్పటికే వైసీపీ విముక్త ఏపీయే లక్ష్యమని ప్రకటించారు. జగన్ కు తెర వెనుక బీజేపీ సహకరిస్తోందని పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే బీజేపీని వదులుకుంటాం కానీ.. వైసీపీని ఓడించాలంటే టీడీపీ ఉండాల్సిందేనని చాలాసార్లు సంకేతాలిచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు నాయకత్వం మార్చి పవన్ ఆలోచనలో మార్పు కోరుకుంటోంది బీజేపీ. అయితే పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇప్పటికీ పవన్ మూడు పార్టీల కలయికనే కోరుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సొంతంగా అధికారంలోకి రావాలంటే బీజేపీతో కలిసి నడవడమే ఉత్తమని సన్నిహితులు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు కాకున్నా.. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో కలయిక వర్కవుట్ అవుతుందని సూచిస్తున్నారు. కానీ ఇప్పటికే పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతున్న దృష్ట్యా శ్రేణుల్లో ధైర్యం నింపాలంటే సీట్లు, ఓట్లు పెంచుకోవాల్సిన అవసరముందని పవన్ అభిప్రాయపడుతున్నారుట. అయితే బీజేపీ తాజా నిర్ణయం మాత్రం పవన్ ను పునరాలోచనలో పడేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.