NEET Paper Leak: రూ.30 లక్షలకు NEET క్వశ్చన్ పేపర్.. వెలుగులోకి సంచలన విషయం

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన బిహార్‌లోని సమస్తేపూర్‌కు చెందిన అనురాగ్‌ యాదవ్‌(22) అనే విద్యార్థి లీక్‌ అయిన పేపర్‌ను బయట పెట్టాడు.

Written By: Raj Shekar, Updated On : June 20, 2024 1:24 pm

NEET Paper Leak

Follow us on

NEET Paper Leak: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌–2024 రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రూ.30 లక్షలకు నీ ప్రశ్నపత్రం విక్రయించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌తో మోదీ ప్రభుత్వం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అడుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ యూసీసీ నెట్‌–2024ను రద్దు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఎన్టీఏకి సమాచారం అందడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నీట్‌లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నా రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

వెలుగులోకి అక్రమాలు..
ఇదిలా ఉండగా నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన బిహార్‌లోని సమస్తేపూర్‌కు చెందిన అనురాగ్‌ యాదవ్‌(22) అనే విద్యార్థి లీక్‌ అయిన పేపర్‌ను బయట పెట్టాడు. అది ఓరిజినల్‌ ప్రశ్నపత్రాన్ని పోలి ఉందని తెలిపాడు. జూనియర్‌ ఇంజినీర్‌ అయిన తన మామ ఈ ప్రశ్పపత్రం మే 4వ తేదీన తనకు ఇచ్చాడని చెప్పాడు. అదేరోజు రాత్రి తాను ప్రిపేర్‌ అయ్యానని తెలిపాడు.

రూ.30 లక్షలకు విక్రయం?
నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో కీలక సూత్రధారి ఆనంద్‌ అమిత్‌ పరీక్షకు ఒకరోజు ముందు ప్రశ్న లీక్‌ చేసినట్లు అంగీకరించాడు. రూ.30 లక్షలు తీసుకుని ప్రశ్నపత్రంతోపాటు సమాధాన పత్రం విద్యార్థులకు ఇచ్చినట్లు వెల్లడించాడు. దానాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో జేఈ సికిందర్‌తో కలిసి నలుగురికి ప్రశ్నపత్రం ఇచ్చినట్లు తెలిపాడు.

ప్లాట్‌లో కాలిన సమాధాన పత్రం..
మరోవైపు పోలీసుల విచారణలో ఆనంద్‌ అమిత్‌ నివాసముండే ప్లాట్‌లో నీట్‌ సమాధాన పత్రాలకు సంబంధించిన కాలిపోయిన అవశేషాలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రిపరేషన్‌ తర్వాత విద్యార్థులు వాటిని కాల్చి ఉంటారని భావిస్తున్నారు.

సుప్రీం కోర్టులో విచారణ..
మరోవైపు నీట్‌ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఏ 1500 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్‌ మార్కులు ఉప సంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. వీరికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. మరోవైపు కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. జూలై మొదటి వారంలో కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుంది.