Chandrababu: ఓటమి నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరికైనా తప్పదు. గత ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. జగన్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయాలు శాపంగా మారాయి. అన్ని వర్గాల ప్రజలు పాలనతో విసిగి తీర్పు ఇచ్చారు. ఏకపక్ష తీర్పు అన్నట్టు ఉంది ప్రజాభిప్రాయం. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం అయ్యిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీసం వైసిపికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయితే గత ఎన్నికల్లో ఈ తరహా ఓటమిని చూసిన చంద్రబాబు. జగన్ పాలనలో వైఫల్యాలవిషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకటి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా పాలన సాగించడం, రెండు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం.. ఈ రెండింటి పైనే అటు అధికారులకు, ఇటు సొంత పార్టీ వారికి ప్రత్యేక పిలుపు ఇచ్చారు చంద్రబాబు.
గత ఐదు సంవత్సరాలుగా జగన్ సొంత పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకుండా పోయారు. ముఖ్యమంత్రిని కలవాలంటే పెద్ద ప్రయాసే నడిచేది. ఈ విషయాన్ని సాక్షాత్ డిప్యూటీ సీఎం రాజన్న దొర చెప్పుకొచ్చారు.తాను లోక్సభకు పోటీ చేస్తానని, తనకు అవకాశం ఇవ్వాలని కోరేందుకు సీఎం అప్పాయింట్మెంట్ కోరితే.. కనీసం లభించలేదని ఆయన చెప్పుకోవడం విశేషం. అయితే చాలామంది వైసిపి నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 2014 నుంచి 2019 మధ్య కూడా చంద్రబాబు ఇదే మాదిరిగా వ్యవహరించారు అన్న విమర్శ ఉంది. అందుకే ఈసారి చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. ఎమ్మెల్యేల నుంచి ఎంపీ వరకు తనను నేరుగా కలవవచ్చని చెప్పుకొచ్చారు. ఈసారి మన మధ్య ఇటువంటి అడ్డు గీతాలు ఉండవని కూడా తేల్చేశారు.
మరోవైపు తన పర్యటన సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజధాని లో ఉన్నప్పుడు కానీ… జిల్లాల పర్యటన సమయంలో కానీ.. ప్రజలకు ట్రాఫిక్ ఆంక్షలు విధించవద్దని.. ఎటువంటి ఇబ్బందులు కలిగించ వద్దని కూడా అధికారులకు ఆదేశించారు. గత ఐదేళ్లలో జగన్ తన పర్యటనలో ప్రజలకు ఇబ్బంది పెట్టారన్న విమర్శ ఉంది. తొలి మూడు సంవత్సరాలు ఆకాశమార్గంలో జగన్ పర్యటించినా.. కింద రోడ్డు మార్గాల్లో కూడా ఆంక్షలు విధించే వారన్న ఆరోపణ ఉండేది. జిల్లాల పర్యటన సమయంలో రోజుల తరబడి ఆంక్షలు కొనసాగేవి. రహదారులు తవ్వేసేవారు. చెట్లు తొలగించేవారు. పచ్చదనం మాయం చేసేవారు. ఇవన్నీ ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. చంద్రబాబు ఈ విషయాన్ని గ్రహించినట్టు ఉన్నారు. అందుకే తన పర్యటనల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు వద్దని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ రెండు అంశాల్లోనే కాదు.. చాలా విషయాల్లో తాను మారానని చంద్రబాబు చెబుతుండడం విశేషం.