Kapil Dev: క్రీడా హబ్ గా ఏపీ.. కపిల్ దేవ్ కు కీలక బాధ్యతలు.. చంద్రబాబు ఆశయం అదే!

క్రీడల ఖిల్లా ఆంధ్ర ప్రదేశ్. ఎంతోమంది క్రీడాకారులను జాతికి అందించింది ఈ రాష్ట్రం. కానీ గత కొన్నేళ్లుగా క్రీడాభివృద్ధి పడకేసింది. అందుకే చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది క్రీడారంగంపై..

Written By: Dharma, Updated On : October 30, 2024 4:22 pm

Kapil Dev

Follow us on

Kapil Dev: ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. అందుకు అవకాశం వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. సంబంధిత రంగాల నిపుణులను సైతం ఆశ్రయిస్తున్నారు. వారిని ప్రత్యేకంగా పిలిచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తాజాగా క్రీడారంగంపై దృష్టి పెట్టారు చంద్రబాబు. రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మార్చాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన చర్యలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ చేరుకున్న కపిల్ దేవ్ కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. అనంతరం కేశినేని చిన్నితో కలిసి కపిల్ దేవ్ చంద్రబాబును కలిశారు. పలు అంశాలపై చర్చించారు. అయితే ప్రధానంగా ఏపీలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో క్రీడల అభివృద్ధిపై కపిల్దేవ్ తో కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే విశాఖ నగరంలో గోల్ఫ్ క్లబ్ ఉంది. మూడోసారి లోగా ప్రాంతంలో ఈ క్లబ్ ఎప్పటినుంచో కొనసాగుతోంది. అటువంటి దానినే అమరావతిలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకోవైపు మౌలిక సదుపాయాల కల్పన, క్రీడల అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం అందించాలని కూడా బలంగా నిర్ణయించుకుంది ఏపీ సర్కార్. 2014 నుంచి 2019 మధ్య తీసుకున్న విధానాలనే మళ్లీ అవలంభించాలని భావిస్తోంది.

* క్రీడలకు ప్రాధాన్యం
గతంలో చంద్రబాబు హయాంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు.పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేవారు.ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను క్రీడాంశాల్లో ప్రోత్సాహం అందించేవారు.చాలామంది విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించారు. వివిధ క్లబ్బులతో పాటుఅకాడమీలు ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి.అయితే గత ఐదేళ్ల వైసిపి పాలనలో క్రీడాభివృద్ధి పడకేసిందన్న విమర్శలు ఉన్నాయి.అందుకే చంద్రబాబు సర్కార్ ఇప్పుడు క్రీడాభివృద్ధిపై ఫోకస్ పెట్టింది.

* సుదీర్ఘ సేవలు
ఇండియన్ క్రికెట్ కు కపిల్ దేవ్ సుదీర్ఘకాలం సేవలందించారు. మొదటి ప్రపంచ కప్ను భారత్ కు అందించిన ఘనత ఆయనదే. ఆల్ రౌండర్ గా, భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరించారు కపిల్ దేవ్. గత కొంతకాలంగా గోల్ఫ్ క్రీడా సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకే కపిల్ దేవ్ సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో క్రీడల అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. కపిల్ దేవ్ ద్వారా ఏపీలో క్రీడాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించే పనిలో పడ్డారు చంద్రబాబు. మొత్తానికైతే ఏపీలో క్రీడాభివృద్ధిపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టడం హర్షించదగ్గ పరిణామం.