AP Anganwadi: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు మరింత పోషకాహారం అందించేందుకు చర్యలు చేపట్టింది. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల మధ్యాహ్నం భోజనానికి సంబంధించి సమూల మార్పులు చేసింది. ఇకనుంచి వారానికి రెండు రోజులపాటు ఎగ్ ఫ్రైడ్ రైస్ తో పాటు ఉడికించిన శనగలు ఇవ్వనున్నారు. బాలామృతంతో చక్కెర స్థాయిని తగ్గించి పోషకాలు పెంచేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మార్పులను కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టి.. అటు తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందుతోంది. దీంతోపాటు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: జగన్ పై దారుణ కామెంట్స్ : కిరణ్ పాపం పండిందిలా..
* మెనూలో సమూల మార్పులు..
అంగన్వాడీ కేంద్రాల్లో( anganvadi centres) మధ్యాహ్నం భోజనానికి సంబంధించి మెనూలో సమూల మార్పులు తీసుకొచ్చారు. అన్ని రకాల కూరగాయలతో పాటు మునగపొడిని పప్పుతో పాటు అందించనున్నారు. బాలామృతం లో ఉండే చక్కెర స్థాయిని తగ్గించాలని నిర్ణయించారు. మూడు నుంచి ఆరేళ్ల పిల్లల కోసం ఈ మార్పులు అనివార్యంగా భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ముందుగా ఈ మార్పులను విశాఖ, ఏలూరు, ఒంగోలు, కర్నూలు జోన్లలో ఒక్కో అంగన్వాడి కేంద్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. నెల రోజులపాటు అమలు చేసి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరిస్తారు. వాటి ఆధారంగా చేర్పులు మార్పులు చేస్తారు.
* బాలామృతంలో పోషకాలు.. బాలామృతంలో( Bala Amrutham ) భాగంగా పోషకాలు పెంచడానికి చేయాల్సిన మార్పులపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో యూనిసెఫ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, టాటా ట్రస్ట్, మంగళగిరి ప్రతినిధులు ఉన్నారు. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వారితో చాలాసార్లు చర్చించారు. వారి సూచనలు, సలహాల ప్రకారం బాలామృతంలో చక్కెర స్థాయిని తగ్గించి.. పెసరపప్పు, గోధుమపిండి, వేయించిన వేరుశెనగ పొడి, శనగపుడిని కలిపి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. దీనిపై తల్లిదండ్రుల నుంచి ఒక కీలక సూచనలు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో తల్లిదండ్రులు బాలామృతంలో వేరుశెనగ కలపడం వల్ల వాసన వస్తోందని.. జీలకర్ర కలిపితే అది తగ్గుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
* ఇక నుంచి రెండు విభాగాలుగా..
ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల్లోపు చిన్నారులకు నెలకు రెండున్నర కిలోల బాలామృతం ఇచ్చేవారు. ఇకపై దానిని రెండు విభాగాలుగా చేస్తారు. ఏడు నుంచి 12 నెలల పిల్లలను జూనియర్ గా.. 13 నుంచి మూడు సంవత్సరాల పిల్లలను సీనియర్ గా పరిగణిస్తారు. ఆ మేరకు పోషకాలతో బాలామృతం లో మార్పులు చేస్తారు. అయితే ఈ బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే అక్షయపాత్ర అన్న క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: నేషనల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్.. ఆకట్టుకుంటున్న జనసేన వీడియో!