AP Districts Heat Warning : ఏపీలో( Andhra Pradesh) ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి. కొద్దిరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరికొన్ని జిల్లాలకు వర్ష సూచన కూడా ఉంది. అయితే మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి. చల్లటి వాతావరణం నెలకొంది. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలకు అసౌకర్యం తప్పేలా లేదు. అయితే సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం లో మార్పులు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీగా ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.
* నెమ్మదించిన రుతుపవనాలు..
నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నెమ్మదించాయి. దాని ప్రభావంతోనే ఎండల తీవ్రత ( summer heat) పెరుగుతోంది. అయితే ఈ ఏడాది ముందుగానే దేశానికి నైరుతి రుతుపవనాలు తాకాయి. ఏపీలో సైతం వారం రోజులు ముందుగానే ప్రవేశించాయి. వాటి ప్రభావంతోనే ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంతా భావించారు. కానీ ఈనెల రెండు తరువాత రుతుపవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దీంతో వర్షాలు పడడం లేదు. అదే సమయంలో వాతావరణం లో తేమ శాతం పెరగడంతో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Also Read : నిప్పుల కొలిమిలా ఏపీ.. ఆ జిల్లాలకు హై అలెర్ట్!
* ఈరోజు ఈ జిల్లాల్లో హై అలర్ట్
ఈరోజు విజయనగరం( Vijayanagaram), పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో ఉక్కపోతతో పాటు గరిష్టంగా 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
* మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికం..
రాష్ట్రంలో నిన్న గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నరసాపురంలో( narasapuram ) ఏకంగా 41.5 డిగ్రీలు, బాపట్లలో 40.4°, జంగమహేశ్వరపురంలో 40 డిగ్రీలు, మచిలీపట్నంలో 39.6 డిగ్రీలు, గన్నవరంలో 39.4°, నెల్లూరులో 39.3°, కావలిలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈ నెల 12 తర్వాత అల్పపీడనాల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.