Viveka Case: వివేకానంద రెడ్డి( vivekanandha Reddy ) హత్య కేసులో బిగ్ ట్విస్ట్. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో మళ్లీ విచారణ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే వివేక కుమార్తె ఆరోపిస్తున్నట్టు.. ఆ నిందితుల చుట్టూ ఉచ్చు ఖాయం. 2019లో దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. అటు తరువాత అనేక మలుపులు తిరుగుతూ ఈ కేసు సిబిఐ కి చిక్కింది. అయితే గతంలోనే ఈ కేసు విచారణను సిబిఐ ముగించింది. కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అయితే వివేక కుమార్తె డాక్టర్ సునీత మాత్రం ఈ కేసు విచారణను మళ్ళీ ప్రారంభించాలని కోరుతూ వచ్చారు. అనేక రకాల అనుమానాలు ఉన్న వ్యక్తులను అసలు విచారించలేదని ఆమె పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రయల్ కోర్టుగా ఉన్న తెలంగాణ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
* సుప్రీం గ్రీన్ సిగ్నల్..
ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో మళ్లీ విచారణకు సిద్ధమని సిబిఐ కూడా స్పష్టం చేసింది. అందుకే సునీతకు సుప్రీంకోర్టు మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసుకోవాలని… కేసును మళ్ళీ విచారించేలా కోరాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు కూడా ఈ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత.. ఇరుపక్షాల వాదనలు విని.. 8 వారాల్లోనే తీర్పు వెల్లడించాలని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. తద్వారా వివేకా కేసును మళ్లీ విచారించేందుకు వీలుగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అనే విషయం స్పష్టం అవుతోంది.
* రాజకీయ ప్రేరేపిత హత్య..
కేవలం రాజకీయ ప్రేరేపిత హత్యగా వివేక కుమార్తె సునీత ఆది నుంచి ఆరోపిస్తున్నారు. తన తండ్రిని చంపిన, చంపించిన నిందితులను కోర్టుకు లాగి.. శిక్ష పడేలా చేయాలన్న కృతనిశ్చయంతో ఆమె ఉన్నారు. ఈ క్రమంలో వైయస్సార్సీపి హయాంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాడు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సహకరించకపోయినా న్యాయ పోరాటం చేశారు. అందుకే సుప్రీంకోర్టు ఆదేశించిన మరుక్షణం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే సునీత పోరాడిన తీరు మాత్రం అభినందనలు అందుకుంటుంది. కన్న తండ్రిని చంపిన నేరస్తులు నిర్భయంగా తిరుగుతున్నారని.. తాము మాత్రం ప్రాణభయంతో రోడ్ల వెంబడి తిరుగుతున్నామని కొద్ది రోజుల కిందట సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోర్టు ఆదేశించిన మరుక్షణం సిబిఐ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
* కూటమి ప్రభుత్వ సహకారం
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వివేకా హత్య కేసు కు సంబంధించి విచారణ పూర్తి అయ్యింది. కోర్టుకు సమర్పించిన అఫీడవిట్లో అది ఓ పత్రం కోసం జరిగిన హత్యగా పేర్కొన్నారు. కానీ సునీత మాత్రం అది రాజకీయ ప్రేరేపిత హత్యగా అనుమానిస్తున్నారు. ఇప్పుడు సిబిఐ విచారణలో అదే హైలెట్ కానుంది. గొడ్డలి పోటును గుండెపోటుగా ఎందుకు పేర్కొన్నారు? తొలి ఫోన్ జగన్ కు ఎందుకు వెళ్ళింది? ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి? రక్తపు మరకలను ఎందుకు అంతగా హడావుడిగా తుడిచేసారు? దీని వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? తాము రాకుండానే వివేక భౌతిక కాయానికి అంతిమ సంస్కారం చేయాలని ఎందుకు భావించారు? అనే ప్రశ్నలను సునీత లేవనెత్తుతున్నారు. నిందితుల ఫోన్ కాల్ డేటా బయటకు వస్తే నిందితులంతా పట్టుబడతారని సునీత చెప్పుకొస్తున్నారు. అయితే ఈసారి సిబిఐ విచారణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా సహకారం అందుతుంది. అదే జరిగితే ఈ కేసులో అనేక రకాల సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.