Margadarshi Case : ‘మార్గదర్శి’ కేసుల వ్యవహారంలో మరో ట్విస్ట్. సంస్థ వ్యవస్థాపకుడు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ ఖాతాదారుడు సంస్థ సేవల్లో జరుగుతున్న జాప్యంపై ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అసలు ఫిర్యాదుదారుడే లేడన్న మార్గదర్శి కేసులో ఇది ఊహించని ట్విస్ట్. ఓ వైపు సీఐడీ దర్యాప్తు జరుగుతుండగా.. మరోవైపు తాజాగా పోలీస్ కేసు నమోదు కావడం గమనార్హం. చిట్ పాడుకున్న సదరు వ్యక్తికి నాలుగు నెలల పాటు డబ్బులు ఇవ్వకుండా తిప్పుతుండడంతో మార్గదర్శి యాజమాన్యంతో పాటు సంబంధించి బ్రాంచ్ సిబ్బందిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ కేసులో ఇప్పటికే ఏపీ సీఐడీ పట్టు బిగుస్తోంది. ఇప్పటికే కీలక ఆస్తులను అటాచ్ చేసింది. సంస్థలో డిపాజిట్లు చేసిన నల్ల కుభేరుల జాబితాను బయటకు తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తమ నల్లధనాన్ని దాచుకునే వేదికగా మార్గదర్శిని మార్చుకున్నారని సీఐడీ ఆరోపిస్తోంది. అందుకే డిపాజిటర్ల వివరాలను అందించాలని పట్టుబట్టింది. దీనికి కోర్టు కూడా అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీం కోర్టుకు ఏకంగా 54 వేల పేజీలతో డిపాజిటర్ల వివరాలను మార్గదర్శి అందించింది. ఈ తరుణంలో ఒక డిపాజిటర్ నేరుగా తనను మార్గదర్శి యాజమాన్యం మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
సక్రమంగా డిపాజిట్లు చెల్లించి చీటీ పాడుకున్న తనకు నాలుగు నెలలుగా నగదు ఇవ్వకుండా మార్గదర్శి సంస్థ ఇబ్బందిపెడుతోందని విజయవాడకు చెందిన ముష్టి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. బాధితుడు శ్రీనివాసరావు టాక్స్ కన్సెల్టెంట్ తో పాటు కొన్ని కంపెనీలకు లీగల్ అడ్వయిజర్ గా పనిచేస్తున్నారు. 2021 సెప్టెంబరు నుంచి లబ్బీపేట మార్గదర్శి బ్రాంచ్ లో నెలకు రూ.లక్ష చొప్పున 50 నెలల పాటు చిట్ లో పాల్గొన్నాడు. 19 నెలల పాటు నెలకు రూ.లక్ష చొప్పున 19 లక్షలు చెల్లించాడు. ఈ ఏడాది మార్చలో కుటుంబ అవసరాల నిమిత్తం రూ.37.50 లక్షలకు చిట్ పాడుకున్నాడు. కానీ మార్గదర్శి యాజమాన్యం ఇంతవరకూ నగదు చెల్లించలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
వాస్తవానికి బ్రాంచ్ ప్రతీ గ్రూపునకు ఒక బ్యాంక్ ఖాతా అమలుచేయాలి. కానీ బ్రాంచ్ లోని అన్ని గ్రూపులకు ఒకే బ్యాంకు ఖాతాను అమలుచేసి మనీ ల్యాండరింగ్ కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు సంస్థ యజమాని రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్, లబ్బీపేట మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావులతో పాటు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మేనేజర్ శ్రీనివాసరావుతో పాటు కొందరు ఉద్యోగులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. అసలు మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారుడే లేడని చెబుతున్న నేపథ్యంలో ఓ ఖాతాదారుడే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.